బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం ఎన్నో విషయాలను తెర మీదకు తీసుకువస్తోంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో నెపోటిజం కారణంగా ఇండస్ట్రీలో కొత్త వచ్చిన వారు పడుతున్న ఇబ్బందులు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే దబాంగ్ ఫేం దర్శకుడు అభినవ్‌ కశ్యప్‌ సంచలన ఆరోపణలు చేశాడు. సల్మాన్‌ ఖాన్ కుటుంబ సభ్యులు తనను వేదించారని, తనకు సినిమాలు రాకుండా చేశారని తన సినిమాలు రిలీజ్ కాకుండా అడ్డుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశాడు. అంతేకాదు సల్మాన్‌ ఖాన్‌తో పాటు ఆయన సోదరులు సోహైల్‌ ఖాన్‌, అర్బాజ్‌ ఖాన్ తండ్రి సలీం ఖాన్‌ను నాకు శత్రువులు అంటూ ప్రకటించాడు.

ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా బాలీవుడ్‌ ఇండస్ట్రీలో కలకలం సృష్టించాయి. సల్మాన్‌ లాంటి బిగ్గెస్ట్ స్టార్ మీద ఇలాంటి ఆరోపణలు రావటంతో  బాలీవుడ్‌ ఉలిక్కి పడింది. అయితే ఈ వార్తలపై సల్మాన్‌ ఖాన్ తండ్రి సలీం ఖాన్‌ స్పందించాడు. ఒక సినిమా రిలీజ్‌ను మరొకరు అడ్డుకున్నట్టుగా ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలకు ముందు నిర్మాత మద్దతు ఉండాలి. దర్శకుడు ఇలాంటి ఆరోపణలు చేస్తే స్పదించాల్సిన అవసరం లేదు అంటూ కొట్టి పారేశాడు. అంతేకాదు సల్మాన్‌ సోదరుడు అర్భాజ్‌ ఖాన్ అభినవ్‌ మీద చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నాడు.

అయితే సలీం ఖాన్‌ ఖండించినా పలు సినీ ప్రముఖులు ఇండస్ట్రీలో నెపోటిజంను బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ముఖ్యంగా కరణ్‌ జోహర్‌, సల్మాణ్ ఖాన్‌, యష్‌ రాజ్ ఫిలింస్‌ లాంటి సంస్థలను టార్గెట్‌ చేస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. తాజాగా కంగనా రనౌత్‌ మరోసారి సుశాంత్ మరణం నేపథ్యంలో ఇండస్ట్రీలోని సమస్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. సుశాంత్‌ది ఆత్మహత్య కాదు హత్య అంటూ తీవ్ర ఆరోపణలు చేసింది.