ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో సలార్ ఒకటి. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో భారీ హైప్ నెలకొంది. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు విడుదలవుతుంది? షూటింగ్ ఎంత వరకు కంప్లీట్ అయ్యిందనేది నిర్మాతలు తెలియజేశారు.
ప్రభాస్ (Prabhas) నుండి ఇకపై రానున్నవన్నీ భారీ చిత్రాలే. ఆయన అప్ కమింగ్ చిత్రాల్లో ఆదిపురుష్ 2023 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న ప్రాజెక్టు కె, సలార్ చిత్రాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అలాగే దర్శకుడు మారుతీతో చేయాల్సిన మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. వీటన్నింటిలో ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం సలార్. కెజిఎఫ్ సిరీస్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇమేజ్ ఎవరెస్ట్ కి చేరింది. ఆయన రాకీ భాయ్ క్యారెక్టర్ కి ఇచ్చిన ఎలివేషన్స్ నభూతో నభవిష్యతి అన్నట్లు ఉన్నాయి.
ఈ క్రమంలో ప్రభాస్ లాంటి మాస్ హీరోని ఈ రేంజ్ లో చూపించనున్నాడో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ కలుగుతున్నాయి. బాహుబలి తర్వాత వరుసగా రెండు పరాజయాలు ఎదుర్కొన్న ప్రభాస్ కి సలార్ (Salaar) పర్ఫెక్ట్ కం బ్యాక్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా ఈ సినిమా అప్డేట్స్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఓ అభిమాని సలార్ అప్డేట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాసిన విషయం తెలిసిందే.
కాగా సలార్ (Salaar Update)ఇప్పటి వరకు 30-35 శాతం పూర్తయిందట. 2023 సమ్మర్ కానుకగా మూవీ విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. కాబట్టి సలార్ థియేటర్స్ లో దిగడానికి మరో ఏడాది సమయం ఎదురుచూడాల్సిందే. కెజిఎఫ్ నిర్మాతలైన హోమబుల్ ఫిలిమ్స్ సలార్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తున్నారు.
