దిగ్గజ నటుడు దిలీప్‌ కుమార్‌ భార్య సైరా బాను ఎమోషనల్‌ అయ్యారు. దిలీప్‌ కుమార్‌కి భారతరత్న ఇవ్వాలని తెలిపారు. 

లెజెండరీ నటుడు దిలీప్‌ కుమార్‌ మన దేశంలోని కోహినూర్‌ అని, ఆయనకు భారతరత్న దక్కాల్సిందే అని తెలిపింది ఆయన భార్య, నటి సైరా బాను. బాలీవుడ్‌ దిగ్గజ నటుడు దిలీప్‌ కుమార్‌ గతేడాది మరణించిన విషయం తెలిసిందే. ఆయనకు తాజాగా కేంద్ర ప్రభుత్వం డాక్టర్‌ అంబేద్కర్‌ పురస్కారాన్ని అందజేశారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో సైరా బాను పాల్గొన్నారు. కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని సైరాబానుకి అందజేశారు. 

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాందాస్‌ మాట్లాడుతూ దిలీప్‌ కుమార్‌ సేవలను కొనియాడారు. సినిమా ద్వారా ఆయన చేసిన సేవలను, ఆయన నటనను గుర్తు చేసుకున్నారు. ఇండియన్‌ సినిమాకి ఆయనొక దిక్సూచి అని తెలిపారు. ఈ సందర్భంగా దిలీప్‌ కుమార్‌కి భారతరత్న ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు.

అనంతరం దిలీప్‌ కుమార్‌కి భారతరత్న ఇచ్చే విషయంపై మీడియా సైరా బానుని ప్రశ్నించింది. దీనికి ఆమె స్పందిస్తూ దేవుడు తలచుకుంటే అది జరుగుతుందని, ఎందుకంటే దిలీప్‌ సాహబ్‌ మన దేశంలోని కోహినూర్‌. కాబట్టి కోహినూర్‌కి కచ్చితంగా భారతరత్న అందాలి అని తెలిపింది. అవార్డు అందుకునే సమయంలో ఆమె ఎమోషనల్‌ అయ్యారు. `ఇందునే నేను ఏ ఫంక్షన్లకి హాజరు కాను. నాకు భయంగా ఉంటుంది. కానీ ఏం చేయాలంటూ` ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. 

ఇంకా సైరా బాను చెబుతూ, దిలీప్‌ కుమార్‌ ఎప్పుడూ తన వెంటే ఉంటాడని, తనని సపోర్ట్ చేస్తుంటాడని తెలిపింది. ఆయన ఇప్పటికీ ఇక్కడే ఉన్నాడని నేను భావిస్తున్నా. ప్రతిదీ చూస్తున్నాడు. నాతో ఉన్నాడు. నా ప్రతి అడుగులో ఆయన ఉంటాడు. ఆయన ఎప్పుడూ నాతోనే ఉన్నాడని నమ్ముతూ ఈ జీవితాన్ని గడపగలను అని తెలిపింది. ఆయన లేడని ఎప్పుడూ భావించనని చెప్పింది సైరా బాను. 

దిగ్గజ బాలీవుడ్‌ నటుడు దిలీప్‌ కుమార్‌, సైరా బాను 1966లో వివాహం చేసుకున్నారు. ఈ జంట కలిసి పలు సినిమాల్లోనూ నటించింది. అందులో `సగిన`, `గోపి` చిత్రాలు ఎంతగానే ఆదరణ పొందాయి. వీరి కెరీర్‌లో మైలు రాయిగా నిలిచాయి.