ఓ వైపు బాలీవుడ్‌ నెపోటిజం వివాదం కొనసాగుతూనే ఉంది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత ఈ వాదన మరింత ఊపందుకుంది. వారసత్వం, బంధుప్రీతి బాలీవుడ్‌లో ఇతరులను రానివ్వడం లేదని, ఎదగనివ్వడం లేదనే విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో మరో స్టార్‌ వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 

బాలీవుడ్‌ అగ్ర నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ తన తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్‌ని హీరోగా పరిచయం చేయబోతున్నారు. ఇప్పటికే సైఫ్‌ తనయు సారా అలీ ఖాన్‌ హీరోయిన్‌గా పరిచయం అయి రాణిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో తన కుమారుడిని ఇంట్రడ్యూస్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు సైఫ్‌ ప్రకటించారు. 

`ఇబ్రహీం చదువు పూర్తయ్యాక సినిమాల్లోకి అడుగుపెడతాడు. సినిమాల్లో నటించాలనుకుంటే ఇప్పటి నుంచి సిద్ధమవ్వాలని చెప్పాను. నా పిల్లలందరినీ సినీ పరిశ్రమలోకి తీసుకొస్తాను. అందుకు సంతోషంగా ఉన్నాను. పనిచేసేందుకు సినీ రంగం మంచి ప్లేస్‌. 18 ఏళ్ళ వయసులో నా జీవితం అంతా గందరగోళంగా ఉండేది. నటన నా కెరీర్‌ పాడవకుండా ఆపింది. మంచి గుర్తింపునిచ్చింది. అందుకే నా పిల్లలను సినీరంగంలోకి తీసుకురావాలనుకుంటున్నాను` అని సైఫ్‌ తెలిపారు.

ఇబ్రహీం, సారా అలీ ఖాన్‌లు సైఫ్‌ మొదటి భార్య అమృతా సింగ్‌లకు జన్మించారు. సైఫ్‌ ఆమెకి 2004లో విడాకులిచ్చారు. ఆ తర్వాత 2012లో కరీనా కపూర్‌ని వివాహం చేసుకున్నారు. వీరికి తైమూర్‌ అలీ ఖాన్‌ కుమారుడు జన్మించారు. ప్రస్తుతం కరీనా ప్రెగ్నెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే.