మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కెరీర్ ఆరంభంలోనే జయాపజయాలని ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం తేజు కెరీర్ స్టడీగా కొనసాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ పోలికలతో ఉండడం తేజుకు అడ్వాంటేజ్. ఇదిలా ఉంటే కేవలం పోలికలు మాత్రమే కాదు సేవ కార్యక్రమాలు విషయంలో కూడా తేజు మావయ్యలని ఆదర్శంగా తీసుకుంటున్నాడు. 

సాయిధరమ్ తేజ్ తాజాగా 100 మంది పిల్లలున్న ఓ స్కూల్ ని దత్తత తీసుకున్నాడు. థింక్ పీస్ అనే ఆర్గనైజేషన్ లో తేజు భాగస్వామి. వారితో కలసి మున్నిగూడలోని అక్షరాలయ అనే స్కూల్ కు సాయిధరమ్ తేజ్ రెండేళ్ల పాటు సేవలు అందించనున్నాడు. పిల్లలకు అవసరమైన పోషకాహారాలతో పాటు ఇతర అవసరాలని తేజు ఈ సంస్థతో కలసి తీర్చనున్నాడు. 

ఈ విషయాన్ని సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. అభిమానులు కూడా తోచిన విధంగా విరాళాలు అందించాలని సాయిధరమ్ తేజ్ కోరాడు. రెండేళ్ల పాటు ఈ స్కూల్ లో సేవ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ ఏడాది మరో 50 మంది పిల్లలని కూడా దత్తత తీసుకోబోతున్నట్లు తేజు ప్రకటించాడు. 

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో 'ప్రతిరోజు పండగే' చిత్రంలో నటిస్తున్నాడు. మారుతి ఈ చిత్రానికి దర్శకుడు. బన్నీవాసు, యూవీ క్రియేషన్స్ సంస్థ కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుప్రీం తర్వాత రాశి ఖన్నా మరోమారు ఈ చిత్రంలో తేజు సరసన నటిస్తోంది.