సినిమా విడుదలకు ముందు సాయిపల్లవి, రానా, వేణు ఉడుగుల సరళ ఫ్యామిలీని కలిశారు. ఆ సందర్భంగా తనపై వారు చూపించిన ప్రేమకి ముగ్దురాలిని అయినట్టు చెప్పింది సాయిపల్లవి.

`విరాటపర్వం` చిత్రంలో సాయిపల్లవి నటించిన `వెన్నెల` పాత్రకి స్ఫూర్తి వరంగల్‌కి చెందిన సరళ అనే విషయం తెలిసిందే. ఆమె మాజీ నక్సలైట్‌ రవన్న ప్రేమ కోసం తపించిన కథతో `విరాటపర్వం` చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు వేణు ఊడుగుల. ఈ చిత్రం శుక్రవారం విడుదలై ప్రశంసలందుకుంటోంది. ఈ నేపథ్యంలో శనివారం రామానాయుడు స్టూడియోలో సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేసి ఆదరిస్తున్న ఆడియెన్స్ కి ధన్యవాదాలు తెలిపారు. 

ఈ సందర్భంగా సాయిపల్లవి మాట్లాడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా విడుదలకు ముందు సాయిపల్లవి, రానా, వేణు ఉడుగుల సరళ ఫ్యామిలీని కలిశారు. ఆ సందర్భంగా తనపై వారు చూపించిన ప్రేమకి ముగ్దురాలిని అయినట్టు చెప్పింది సాయిపల్లవి. సొంత కూతురిలా తనని రిసీవ్‌ చేసుకున్నారు. వారి సరళగా భావించిన తనపై ఎంత ప్రేమని చూపించారో ఆ అనుభూతి తాను పొందానని, అదే సమయంలో సరళని మిస్‌ అయినందుకు వాళ్లు ఎంత బాధపడుతున్నారో ఆ బాధ తనకు కలిగిందని తెలిపింది. సినిమా షూటింగ్‌కి ముందే వారిని తాను కలిస్తే బాగుండేదని, కలవనందుకు చాలా బాధగా ఉందని తెలిపింది. 

సినిమాలో తాను ఓ నటిగానే నటించానని, కానీ సరళ ఫ్యామిలీలో ఉన్నంత బాధ తనకు లేదని, ఒకవేళ ముందే వారిని కలిస్తే ఆ బాధతో తాను నటించేదాన్ని అని తెలిపింది. అప్పుడు మరింతగా పాత్రకి సహజత్వం చేకూరేదనేది సాయిపల్లవి ఉద్దేశం. ఈ విషయంలో తమకి సపోర్ట్ చేసిన సరళ అన్నయ్య తూము మోహన్‌రావుకి థ్యాంక్స్ చెప్పింది. ఇలాంటి ఓ కథతో సినిమా తీస్తానంటే ఎవరూ ఒప్పుకోరు. భయమేస్తుంటుంది. మా ఫ్యామిలీ వారి కథని తీస్తానంటే నేనైతే ఒప్పుకునేదాన్ని కాదు. ఈ విషయంలో సరళ ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పుకుంటానని తెలిపింది సాయిపల్లవి. 

మోహన్‌రావుగారు తనని ఓ చెల్లిలా భావించి బొట్టు పెట్టి చీర పెట్టి పంపించారు. అది తనకు చాలా ఎమోషనల్‌ మూవ్‌మెంట్‌ అని చెప్పింది. తాను ఫస్ట్ టైమ్‌ ఇలా నిజ జీవితం ఆధారంగా సినిమా తీసిన సినిమాలో చేశానని, ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమైనదని పేర్కొంది. మంచి మంచి హార్ట్ ఉన్నవాళ్లంతా మళ్లీపుడతారు, ఇంక పెద్ద పోస్ట్ లో వచ్చి వాళ్లు ఏమనుకున్నారో దాన్ని నెరవేరుస్తారని చెప్పింది సాయిపల్లవి. సురేష్‌బాబు సపోర్ట్ మరువ లేనిది అని పేర్కొంది. సినిమాని ఆదరిస్తున్న ఆడియెన్స్ కి, సినిమాని చూసి ప్రశంసిస్తున్న సినీ వర్గాలకు థ్యాంక్స్ చెప్పింది. కొందరు ఒకటికి రెండు సార్లు చూసి బాగా అర్థం చేసుకుని సినిమా బాగా నచ్చిందని చెబుతున్నారు. మళ్లీ మళ్లీ చూస్తామని చెబుతున్నారు. అందుకు చాలా ఆనందంగా ఉంద`ని పేర్కొంది.

దర్శకుడు వేణు ఉడుగులు చెబుతూ, సాయిపల్లవి ఒప్పుకోకపోతే ఈ సినిమా చేసేవాడిని కాదని తెలిపారు. ఆమె అందించిన సపోర్ట్ మరువలేనిదని పేర్కొన్నారు. రానాగారు ఎంతో నమ్మి చేశారని, సినిమాకి పిల్లర్‌గా నిలిచారన్నారు. సురేష్‌బాబు సర్‌ తమకి టీచర్‌లాగా ఉండి బ్యాక్‌ నుంచి వెన్నుదన్నుగా నిలిచారని, ఆయనకు థ్యాంక్స్ చెప్పారు వేణు. అలాగే సినిమాకి అద్భుతమైన స్పందన వస్తుందని, పెద్ద హిట్‌ చిత్రంగా నిలుస్తుందన్నారు.

`ఆర్ట్ ని, కమర్షియాలిటీని కలిసి చూడటం చాలా తక్కువ. సినిమా మేకర్స్ గా తాము రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సి ఉందని, వ్యాపార కోణంలో చూసినప్పుడు ఇలాంటి సినిమాలు చాలా రిస్క్ తో కూడినవని, కానీ ఆర్ట్ కే ప్రాధాన్యతనిచ్చి చేసిన చిత్రమిదని సురేష్‌బాబు తెలిపారు. తమ బ్యానర్‌లో ఇలాంటి సినిమా తీయడం ఇదే ఫస్ట్ అని చెప్పారు.ఇలాంటి సినిమాలను ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు.