శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన నీది నాది ఒకే  కథ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు వేణు ఉడుగుల. ప్రతి ఇంట్లో కనిపించే ఓ సామాన్యుడి కథను, తెరపై మనసుకు హత్తుకునేలా చూపించిన వేణు తొలి సినిమాతోనే కమర్సియల్‌గానూ మంచి విజయం సాధించాడు. రెండో ప్రయత్నంగానూ రొటీన్ ఫార్ములా సినిమాకు భిన్నంగా విరాటపర్వం అనే పీరియాడిక్‌ కథను ఎంచుకున్నాడు. రానా, సాయి పల్లవిలు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ చాలా వరకు పూర్తయ్యింది.

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్‌ కారణంగా షూటింగ్‌కు బ్రేక్‌ పడింది. అయితే ఈ రోజు (శనివారం) సాయి పల్లవి పుట్టిన రోజు సందర్భంగా సినిమాలోని ఆమె లుక్‌ను రివీల్‌ చేశారు చిత్రయూనిట్‌. ఈ సినిమాలో సాయి పల్లవి నక్సలైట్ పాత్రలో నటిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌ ఆ వార్తలకు మరింత బలం చేకూర్చేదిగా ఉంది. ఓ అమర వీరుల స్థూపం దగ్గర ఒంటరిగా కూర్చున సాయి పల్లవి స్టిల్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో రిలీజ్ చేశాడు దర్శకుడు వేణు.

ఈ లుక్‌ తో పాటు `అడవి మార్గాన ఉన్న ఆ అమరవీరుల స్తూపం దగ్గరే ఆమె ఎందుకు ఒంటరిగా కూర్చుంది?ఎవరి కోసం ఆమె నిరీక్షణ ?ఆమె ఒడిలోని డైరీలో రాసి ఉన్నఅక్షరాలేమిటి?ఆమె పక్కనున్న బ్యాగ్ లో ఉన్నవేమిటి?ఈ ప్రశ్నలకు జవాబులు విడుదల తర్వాతే` అంటూ కామెంట్ చేశాడు. ఈ పోస్ట్‌తో సినిమా మీద మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలో విలక్షణ నటి నందిత దాస్‌తో పాటు ప్రియమణి, నవీన్‌ చంద్రలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.