సెన్సేషనల్ టాక్ షోలో సాయి పల్లవి... ఆ ప్రశ్నలకు సమాధానాలు దొరికేనా!
సాయి పల్లవి కొత్త చిత్రాలకు సైన్ చేయడం లేదు. దీంతో అనేక పుకార్లు తెరపైకి వచ్చాయి. సాయి పల్లవి తాజాగా ఓ టాక్ షోలో పాల్గొనగా ఆమెపై జరుగుతున్న ప్రచారానికి సమాధానాలు దొరుకుతున్నాయని అందరూ భావిస్తున్నారు.

సాయి పల్లవి సినిమాలు మానేశారనే ప్రచారం గట్టిగా జరుగుతుంది. ఆమె పెళ్లి చేసుకోబోతున్నారని... లేదు డాక్టర్ గా మారి ప్రజలకు సేవలు చేయాలనుకుంటున్నారని పలు ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఈ పుకార్లకు సాయి పల్లవి నేరుగా సమాధానం చెప్పిన దాఖలాలు లేవు. అయితే మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నానని చెప్పి అస్పష్టంగా స్పందించారు. సినిమాల సంగతి అటుంచితే పెళ్లిపై క్లారిటీ కోరుకుంటున్నారు ఫ్యాన్స్. ఒక సెలిబ్రిటీ వ్యక్తిగత జీవితం మీద అందరికీ ఆసక్తి ఉంటుంది.
సాయి పల్లవి గురించి అందరి మనస్సులో ఉన్న సందేహాలకు సమాధానాలు దొరికే అవకాశం వచ్చింది. సాయి పల్లవి ఓ టాక్ షోలో పాల్గొన్నారు. సోనీ లైవ్ లో త్వరలో ప్రసారం కానున్న 'నిజం విత్ స్మిత' షోలో ఆమె పాల్గొన్నారు. ఫిబ్రవరి 10న సాయి పల్లవి ఎపిసోడ్ ప్రసారం కానుంది.
సింగర్ స్మిత హోస్ట్ గా ఉన్న సాయి పల్లవి ఎపిసోడ్ కొంచెం వాడివేడిగానే సాగినట్లుంది. దీంతో సాయి పల్లవి ఎపిసోడ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా సాయి పల్లవి ప్రత్యేకమైన హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. దానికి కారణం ఆమె చేసే సినిమాలు, ఎంచుకునే పాత్రలు. సాయి పల్లవికి మాత్రమే ఇలాంటి మంచి పాత్రలు ఎలా వస్తున్నాయని మిగతా హీరోయిన్స్ కుళ్ళుకునేలా ఆమె సినిమాలు ఉంటాయి. హీరోకి సమానమైన స్క్రీన్ స్పేస్ ఉన్న పాత్రలు చేసే హీరోయిన్ ఈ జనరేషన్ లో సాయి పల్లవి మాత్రమే.
ముఖ్యంగా ఫిదా మూవీలో హీరో వరుణ్ తేజ్ ని డామినేట్ చేసేలా సాయి పల్లవి పాత్ర ఉంటుంది. ఫిదా హిట్ క్రెడిట్ మొత్తం సాయి పల్లవిదే. లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ చిత్రాల్లో బలమైన పాత్రలు చేశారు. తెలుగులో సాయి పల్లవి చివరి చిత్రం విరాటపర్వం. మరోవైపు కొత్త చిత్రాల గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పుష్ప 2 మూవీలో సాయి పల్లవి నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా అధికారిక సమాచారం లేదు.