Asianet News TeluguAsianet News Telugu

వివాదాల్లో ట్రెండింగ్‌ సాంగ్‌ `సారంగ దరియా`.. తమకి గుర్తింపునివ్వలేదంటూ కోమలి, శిరీష ఆవేదన

ఇటీవల ట్రెండ్‌ అవుతున్న `సారంగ దరియా` పాటలో సాయిపల్లవి తన అద్భుతమైన డాన్స్ తో పాటకే సరికొత్త ఊపుని తీసుకొచ్చింది. ఈ పాటని మంగ్లీ ఆలపించగా, పవన్‌ సీహెచ్‌ సంగీతం అందించారు. సామాజిక మాధ్యమాల్లో దుమ్మురేపుతున్న ఈ పాటని తాజాగా వివాదం వెంటాడుతుంది. 

sai pallavi acted saranga dariya song in conroversy arj
Author
Hyderabad, First Published Mar 7, 2021, 7:34 PM IST

`సారంగ దరియా` పాట ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఎంతగా దుమ్మురేపుతుందో అందరికి తెలిసిందే. `లవ్‌ స్టోరి` చిత్రంలోని ఈ పాట ఆ మధ్య విడుదలై పది మిలియన్స్ కి పైగా వ్యూస్‌ని దక్కించుకుని యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. ఇందులో సాయిపల్లవి తన అద్భుతమైన డాన్స్ తో పాటకే సరికొత్త ఊపుని తీసుకొచ్చింది. ఈ పాటని మంగ్లీ ఆలపించగా, పవన్‌ సీహెచ్‌ సంగీతం అందించారు. సామాజిక మాధ్యమాల్లో దుమ్మురేపుతున్న ఈ పాటని తాజాగా వివాదం వెంటాడుతుంది. 

ఈ జానపద పాటని `లవ్‌స్టోరి` చిత్రంలో పాడించారు. నిజానికి ఈ పాట పదేళ్ల క్రితమే `రేలా రేలారే` అనే జానపద పాటల కార్యక్రమంలో ఆలపించారు. అప్పుడే ఈ పాటకి మంచి ఊపు, క్రేజ్‌ వచ్చింది. కోమలి అనే జానపద గాయకురాలు ఈ పాటని సేకరించి ఆలపించారు. ఈ కార్యక్రమంలో రైటర్‌ సుద్దాల అశోక్‌ తేజ కూడా ఉన్నారు. మరోసందర్భంలో శిరీష అనే గాయని కూడా ఈ పాటని రేలారేలారే.. కార్యక్రమంలోనే పాడారు. ఆ సమయంలో జడ్జ్ లుగా గోరటి వెంకన్న, వందేమాతరం శ్రీనివాస్‌ లు ఉన్నారు. 

అయితే తాజాగా నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన `లవ్‌ స్టోరి` చిత్రంలో ఈ పాటని మంగ్లీ చేత పాడించారు. దీనికి రైటర్‌గా సుద్దాల పేరు వేశారు. కానీ తాను పాడే సమయంలో తన అమ్మమ్మ నుంచి ఈ పాటని సేకరించానని కోమలి చెప్పుకొచ్చింది. ఇటీవల పాట బాగా పాపులర్‌ అయిన నేపథ్యంలో ఆమె బయటకు వచ్చారు. ఈ పాట కోమలినే సేకరించారని సుద్దాల కూడా ఒప్పుకున్నారు. కానీ ఆమెకి ఇందులో క్రెడిట్‌ ఇవ్వలేదు. అంతేకాదు ఆమె పాడటానికి ముందే ఈ పాట తన వద్ద ఉందని సుద్దాల చెబుతున్నారు. 

అయితే కనీసం ఇందులో తనకు పాడే అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని కోమలి వాపోతుంది. గొప్ప పాటని తాను ఇంకా బాగా పాడేదాన్ని అని, తాను సేకరించిన పాటని వేరే వాళ్లు పాడటం తనకు అసంతృప్తిగా, బాధగా ఉందని ఆమె మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. శిరీష సైతం తానే ముందు ఈ పాట పాడానని చెబుతుంది. తనకు గుర్తింపు ఇవ్వలేదని ఆమె డిమాండ్‌ చేస్తుంది. దీంతో అత్యంత పాపులర్‌ అవుతున్న ఈ పాట ఇప్పుడు వివాదంగా మారింది. కోమలి ఆవేదనపై దర్శకుడు శేఖర్‌ కమ్ముల స్పందించారని, తన నెక్ట్స్ సినిమాలో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios