రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగీత దర్శకుడుని  సినీ హీరో సాయి దరమ్‌ తేజ్‌ తన చేతుల మీదుగా తీసుకొని వెళ్లి ఆసుపత్రిలో అడ్మిట్‌ చేసారు. అయితే  ఆ సంగీత దర్శకుడు  ఆయన స్నేహితుడే కావడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే....హైదరాబాద్ .. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 52లో ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తూ ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి టైర్‌ స్కిడ్‌ అయి కింద పడ్డాడు. దాంతో అచ్చు పది అడుగుల దూరం ఎగిరిపడ్డారు. అదే సమయంలో నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోలో   షూటింగ్ ముగించుకుని అటుగా వెళ్లున్న సాయి ధరమ్‌ తేజ్‌ ప్రమాదాన్ని చూసి కిందకు దిగి ఘటనా స్థలికి చేరుకున్నారు. 

చూస్తే ఆ గాయపడిన వ్యక్తి తన స్నేహితుడు, మ్యూజిక్‌ డైరక్టర్‌ అచ్చు అని తెలుసుకొని స్వయంగా వెళ్లి  అపోలో హాస్పిటల్‌లో జాయిన్‌ చేశారు. ఆయన కాలుకి తీవ్రంగా గాయాలు అయ్యాయి.  కాగా, మానవత్వంతో స్పందించిన సాయి తేజ వ్యక్తిత్వాన్ని అందరూ ప్రశంసించారు.  

సాయి తేజ్‌ కెరీర్ విషయానికి వస్తే... మారుతి  డైరక్షన్ లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. గీతా ఆర్ట్స్‌ నిర్మించే ఈ చిత్రానికి   ‘ప్రతి రోజూ పండగే’ అనే టైటిల్ ని పెట్టారు. ఈ  చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. మారుతి కథలు ఎంటర్టైనింగ్ గా సాగుతాయి. ఈసారి ఫన్ తో పాటు కుటుంబ బంధాలు, మానవ సంబంధాలకూ ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.