సినిమా ఇండస్ట్రీలో రూమర్లకు కొదవ ఉండదు. హీరో, హీరోయిన్ కానీ దర్శకులు, నటీమణులు ఇలా ఎవరు సన్నిహితంగా కనిపించినా వారి మధ్య ఎఫైర్ ఉందంటూ రూమర్లు పుట్టుకొస్తుంటాయి. హీరో సాయి ధరం తేజ్ పై కూడా ఇలాంటి రూమర్లు వినిపించాయి.

ఓ హీరోయిన్ తో తేజుకి ఎఫైర్ ఉందంటూ వార్తలు వినిపించాయి. ఆమె మరెవరో కాదు.. రెజీనా. 'పిల్లా నువ్వులేని జీవితం'లో కలిసి నటించిన ఈ జంట ఆ తరువాత 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమాలో కూడా కలిసి కనిపించారు. బయట కూడా ఈ జంట కలిసి కనిపించడం, సన్నిహితంగా మెలగడం చూసి వీరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు పుట్టుకొచ్చాయి.

అయితే ఈ మధ్యకాలంలో వీరిద్దరూ ఎక్కడా కనిపించడం లేదు. తాజాగా ఈ విషయంపై స్పందించిన తేజు పరోక్షంగా రెజీనా గురించి మాట్లాడాడు.

''అప్పట్లో ఓ హీరోయిన్ తో ఏవేవో రూమర్లు పుట్టించారు. అలాంటి ప్రచారాల వలన ఆ అమ్మాయి కెరీర్ నాశనం అవుతుందని భయపడి సీరియస్ గా తీసుకోవాల్సి వచ్చింది. అప్పటినుండి ఆమెకు దూరంగా ఉన్నాను. మా మధ్య స్నేహం పాడవడం ఇష్టం లేదు. ఆమె నా తొలి సినిమా హీరోయిన్. ఆమె నాకు గౌరవం ఉంది'' అంటూ చెప్పుకొచ్చాడు.

తన తొలి సినిమా దర్శక, నిర్మాతలు ఎంత స్పెషలో.. ఆమె కూడా అంతే స్పెషల్ అని అందుకే చనువుగా ఉండేవాడిని అంటూ తెలిపారు. తేజు.. రెజీనా పేరు చెప్పనప్పటికీ అతడు మాట్లాడింది మాత్రం ఆమె గురించే అనే విషయంలో స్పష్టంగా తెలుస్తోంది.