వరుసగా మూడు హిట్ సినిమాలు అందుకొని లైమ్ లైట్ లోకి వచ్చేశాడు మెగామేనల్లుడు సాయి ధరం తేజ్. ఆ తరువాత వరుసగా ఫ్లాప్ మీద ఫ్లాప్ పడుతూనే ఉంది. ఐదు ఫ్లాప్ సినిమాల తరువాత విడుదలైన 'తేజ్ ఐ లవ్ యూ' సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు ధరం తేజ్. కానీ ఈ సినిమా ఊహించినట్లుగానే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అలా అని తేజ్ ను తక్కువ చేసి చూడలేం. మంచి టాలెంట్ ఉన్న నటుడు. డాన్స్, యాక్షన్ ఇలా అన్ని విషయాల్లో కష్టపడతాడు.

కానీ సక్సెస్ మాత్రం అతడిని వరించడం లేదు. దీంతో అతడితో సినిమాలు చేయాలనుకున్న దర్శకులు కూడా ఇప్పుడు తేజ్ నుండి దూరంగా వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రశేఖర్ ఏలేటి.. తేజ్ తో చేయాలనుకున్న కథను నానికి వినిపించి ఓకే చేయించుకున్నాడని టాక్. అలానే మరో రెండు, మూడు సినిమాలు కూడా తేజ్ నుండి చేజారినట్లు తెలుస్తోంది. అయితే కిషోర్ తిరుమలతో చేస్తోన్న 'చిత్రలహరి' మాత్రం తన దగ్గర నుండి చేజారనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు. ప్రస్తుతానికి తేజ్ చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా ఇది.

'నేను శైలజ','ఉన్నది ఒకటే జిందగీ' వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమల ఈ సినిమాలో తేజ్ ను మధ్య తరగతి యువకుడిగా చూపించబోతున్నారు. ఈ సినిమాతో తనకు కచ్చితంగా బ్రేక్ వస్తుందని నమ్ముతున్న తేజ్ తన నుండి వెళ్లిపోయిన దర్శకుల గురించి పెద్దగా ఆలోచించడం లేదని సమాచారం. ఈ సినిమా సక్సెస్ అయితే అవకాశాలు తనను వెతుక్కుంటూ వస్తాయని అనుకుంటున్నాడు. ఈ సినిమా మీదే తేజ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. మరి దీంతో అయినా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి!