సాయిధరమ్‌ తేజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు వరుస పరాజయాలు రావడంతో ఇక సాయిధరమ్‌ తేజ్‌ పనైపోయిందని, ఆయన సినిమాలు మానేసుకోవాల్సిందే అని, వేరే పనిచూసుకోవడం బెటర్‌ అని రకరకాలుగా అన్నారు.

సాయిధరమ్ తేజ్‌.. ప్రమాదం నుంచి బయటపడి విజయవంతంగా రాణిస్తున్నారు. అంతకు ముందు వరుస పరాజయాలు ఆయన్ని వెంటాడాయి. కానీ `విరూపాక్ష` సినిమా కెరీర్‌ పరంగా పెద్ద బూస్ట్ ఇచ్చింది. ఆ సినిమా వంద కోట్లు వసూలు చేసింది. హీరోగా మరో మెట్టు ఎక్కించింది. ఈ నేపథ్యంలో సాయిధరమ్‌ తేజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు వరుస పరాజయాలు రావడంతో ఇక సాయిధరమ్‌ తేజ్‌ పనైపోయిందని, ఆయన సినిమాలు మానేసుకోవాల్సిందే అని, వేరే పనిచూసుకోవడం బెటర్‌ అని రకరకాలుగా అన్నారు. అనేక వార్తలు రాశారు. ఒకానొక దశలో ఇవన్నీ చూసి నాకూ అలానే అనిపించింది. `ఏంటి నేను సినిమాలు చేయలేనా` అని ఫీలయ్యానని తెలిపారు సాయి ధరమ్‌ తేజ్‌. కానీ `విరూపాక్ష` మూవీ తనకు పెద్ద బూస్ట్ ఇచ్చిందని, నాపై నాకు నమ్మకాన్ని ఏర్పర్చిందని తెలిపారు సాయితేజ్‌. ఆ హిట్‌ అనేక కామెంట్లకి సమాధానం చెప్పిందన్నారు. 

ప్రస్తుతం ఆయన తన మేనమామ, పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్‌తో కలిసి `బ్రో` చిత్రంలో నటించారు. మరో రెండో రోజుల్లో(జులై 28) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయితేజ్‌ మీడియాతో ముచ్చటించారు. సినిమా గురించి, పవన్‌ కళ్యాణ్‌ గురించి, యాక్సిడెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్రివిక్రమ్‌ లాంటి డైరెక్టర్‌ ఈ సినిమాకి పనిచేయడం వల్ల, ఆయనతో కలిసి పనిచేసిన అనుభూతికి కలిగిందన్నారు. తన కెరీర్‌లో అలాంటి దర్శకుడితో పనిచేయడం చాలా కష్టం. గొప్ప అవకాశం. ఆయన ఈ సినిమాకి మాటలు, స్క్రీన్‌ ప్లే అందించడం గొప్పగా భావిస్తున్నట్టు తెలిపారు. 

పవన్‌ కళ్యాణ్‌తో కలిసి పనిచేయడంపై సాయితేజ్‌ చెబుతూ, పవన్‌ కళ్యాణ్‌ మామ నన్ను చిన్నప్పట్నుంచి సపోర్ట్ చేశారు. హీరో అవుతానంటే యాక్టింగ్‌ స్కూల్‌కి పంపించారు. ఆయన వద్ద నేను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అవకాశం `బ్రో` చిత్రంతో వచ్చింది. ఇది నా కెరీర్ కి ట్రిబ్యూట్ ఫిల్మ్. నేను గురువుగా భావించే మావయ్యతో కలిసి సినిమా చేయడం చాలా సంతోషాన్నిచ్చింది. అయితే మొదటి రోజు సెట్లో చాలా కంగారు పడ్డాను. వణికిపోయాను. మావయ్య పిలిచి ఎందుకురా కంగారు పడుతున్నావు, నేనే కదా అంటూ నా టెన్షన్ అంతా తీసి పక్కనపెట్టారు. దాంతో వెంటనే సెట్ అయిపోయాను. సముద్రఖని కూడా బాగా సపోర్ట్ చేశారు. వారిచ్చిన సపోర్ట్ తోనే ఫ్రీగా నటించగలిగాను. పవన్‌తో పనిచేయడం ప్రతి క్షణం మెమొరబుల్ మూమెంటే. మా మావయ్యతో అన్నిరోజులు సమయం గడిపే అవకాశం లభించింది. సినిమా మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు నన్ను సరదాగా ఆటపట్టిస్తూనే ఉన్నారు. చిన్నప్పుడు నాతో ఎంత సరదాగా ఉండేవారో, ఇప్పటికీ నాతో అలాగే ఉన్నారు. చిన్నప్పుడు నేను కళ్యాణ్ మావయ్యతో ఎక్కువ సమయం గడిపేవాడిని. దాంతో తెలియకుండానే ఆయనతో ఓ ప్రత్యేక అనుబంధం ఏర్పడింది.

సాయిధరమ్‌ తేజ్‌ సినిమాల నుంచి బ్రేక్‌ తీసుకున్నట్టు వచ్చిన వార్తలపై స్పందిస్తూ అది నిజమే అని, తాను ఆరు నెలల పాటు బ్రేక్‌ తీసుకుంటున్నానని స్పష్టం చేశారు. ఆరోగ్యం పరంగా పూర్తి ఫోకస్‌ పెట్టాలని, ఇంకా బెటర్‌ కావడానికి కోసం విశ్రాంతి తీసుకుంటున్నట్టు చెప్పారు సాయితేజ్‌. అయతే మెగా ఫ్యామిలీలో పెద్ద హీరోలతో కలిసి పనిచేసే అవకాశం తనకే వచ్చిందని, అందుకు అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు చిరంజీవిగారితోనూ కలిసి నటించే అవకాశం వస్తే బ్రేక్ తీసుకోకుండా సినిమా చేసేందుకు సిద్ధమే అని వెల్లడించారు. మా ముగ్గురు మామయ్యలతో కలిసి సినిమా చేయాలని ఉందన్నారు. అంతేకాదు మెగా హీరోలతోపాటు, ఇతర హీరోలతోనూ సినిమాలు చేసేందుకు సిద్ధమే అని చెప్పారు. ముఖ్యంగా రవితేజ, ప్రభాస్ అన్నతో చేయాలని ఉంది. అలాగే కళ్యాణ్ రామ్ అన్న, నా ఫ్రెండ్ తారక్, మనోజ్ ఇలా అందరితో చేయాలని ఉందని వెల్లడించారు సాయిధరమ్‌ తేజ్‌. 

ప్రస్తుతం సంపత్‌ నందితో `గంజా శంకర్‌` అనే సినిమా చేస్తున్నట్టు తెలిపారు. ఈ సినిమా తన బ్రేక్‌ అనంతరం స్టార్ట్ అవుతుందన్నారు. మరోవైపు ఓ కొత్త యువ దర్శకుడితో షార్ట్ ఫిల్మ్ చేశానని, సైనికుల భార్యల కథాంశంతో ఈ షార్ట్ ఫిల్మ్ సాగుతుందని, త్వరలోనే దీన్ని రిలీజ్‌ చేయబోతున్నట్టు తెలిపారు. ఇంకోవైపు యాక్సిడెంట్‌ గురించి చెబుతూ, ప్రమాదం తర్వాత తనకు మాట వచ్చేది కాదని, చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. ఆ సమయంలో మాట విలువ తెలిసిందన్నారు సాయితేజ్‌. ఇంకోవైపు సినిమాల్లో నటించడం కూడా చాలా కష్టమైందని, డైలాగులు చెప్పే విషయంలో చాలా ఇబ్బంది పడినట్టు పేర్కొన్నారు. డబ్బింగ్‌లో మరింత కష్టమైందన్నారు. 

పవన్‌ కళ్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన `బ్రో` చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో తమిళంలో వచ్చిన `వినోదయ సిత్తం` చిత్రానికిది రీమేక్‌. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటించారు. జీవితం విలువ తెలిపే చిత్రమని, ఫ్యామిలీ విలువలు, రొమాన్స్, వినోదం, మాస్‌ ఎలిమెంట్లు ఇలా అన్ని సమపాళ్లలో ఉంటాయన్నారు సాయితేజ్‌. ఈ నెల 28న సినిమా విడుదల కానుంది.