'రన్ రాజా రన్' సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమైన సుజీత్ తన రెండో సినిమా చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో బిజీగా ఉండడంతో సుజీత్ సినిమా మొదలవ్వడానికి కాస్త సమయం పట్టింది. రెండో సినిమాకే మూడు వందల కోట్ల బడ్జెట్ చేతిలోకి తీసుకున్నాడు సుజీత్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో  సినిమా తీసే ఛాన్స్ అతడికి దక్కింది.

అందులోనూ 'బాహుబలి' తరువాత ప్రభాస్ పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు. ప్రభాస్ కోసం ఇన్నేళ్లు ఎదుచూసిన అతడికి తగిన ప్రతిఫలమే దక్కింది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా హ్యాండిల్ చేస్తాడా..? అనే సందేహాలు మొదట్లో కలిగినా.. సినిమా ట్రైలర్ చూసిన వారికి పెద్ద షాకిచ్చాడు. తన టాలెంట్ ఇదని ట్రైలర్ తోనే నిరూపించే ప్రయత్నం చేశాడు.

'సాహో' సినిమాకి ఏవరేజ్ టాక్ వచ్చినా సరే.. నాన్ బాహుబలి రికార్డులను బద్దలుకొడుతుంది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి సుజీత్ పై పడింది. హీరోలు, నిర్మాతలు సుజిత్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కొందరు నిర్మాతలు అతడిని కలిసి అడ్వాన్స్ లు ఆఫర్ చేస్తున్నా.. సుజిత్ మాత్రం ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదట.

సినిమా రిజల్ట్ రాకుండా ఎవరితో సినిమా కమిట్ అయ్యే ఆలోచన సుజిత్ కి లేనట్లు తెలుస్తోంది. అందుకే అడ్వాన్స్ లకు దూరంగా ఉంటున్నాడు. ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అతడిని కలుస్తున్నా.. 'సాహో తరువాత మాట్లాడదాం' అని చెబుతున్నాడట. ఇది ఇలా ఉండగా.. సుజిత్ తన తదుపరి సినిమా కూడా యువి క్రియేషన్స్ లో చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.