Asianet News TeluguAsianet News Telugu

విష వలయంలో విజయ్‌.. తండ్రి చంద్రశేఖర్‌ సంచలన వ్యాఖ్యలు

విజయ్‌పై మరో సంచలన వ్యాఖ్యలు చేశారు తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌. విజయ్‌ ఓ విష వలయంలో కొట్టుమిట్టాడుతున్నాడని ఆరోపించారు. ఓ తమిళ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. 

sa chandra shekar sensational comments on thalapathi vijay arj
Author
Hyderabad, First Published Nov 8, 2020, 9:02 AM IST

తమిళ హీరో, ఇళయ దళపతి విజయ్‌ రాజకీయ వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన తండ్రినే ఇప్పుడు ఆయన తలనొప్పిగా మారారు. తాజాగా విజయ్‌పై మరో సంచలన వ్యాఖ్యలు చేశారు తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌. విజయ్‌ ఓ విష వలయంలో కొట్టుమిట్టాడుతున్నాడని ఆరోపించారు. ఓ తమిళ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఎస్‌ఏ చంద్ర శేఖర్‌ మాట్లాడుతూ, `విజయ్ చుట్టూ దుష్ట శక్తులు చేరాయన్నారు. మూడు రోజులకు ముందు విజయ్‌ అభిమాన సంఘాల సమాఖ్యగా ఉన్న `విజయ్‌ మక్కల్‌ ఇయక్కం`ను రాజకీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘంలో రిజిస్టర్‌ చేసినట్టు ఆయన ప్రకటించారు. కానీ ఆ ప్రకటన జారీ చేసిన కొద్ది సేపటికే విజయ్‌ స్పందిస్తూ, తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ ప్రారంభించిన పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని, అందులో తన అభిమానులెవరూ చేరవద్దని, `విజయ్‌ మక్కల్‌ ఇయక్కం` పేరునిగానీ, దాని పతాకాన్ని గానీ, తన పేరుని, ఫోటోనిగానీ వాడొద్దని స్పష్టం చేశారు. 

దీనిపై చంద్రశేఖర్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, విజయ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, `విజయ్‌ మక్కల్‌ ఇయక్కం`ని రాజకీయ పార్టీగా మార్చాలన్నది తాను తీసుకున్న నిర్ణయమని చెప్పారు. 1993నుంచి `విజయ్‌ మక్కల్‌ ఇయక్కం` భారీ ఎత్తున సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఆ ఇయక్కం సభ్యులకు తగిన గుర్తింపు ఇవ్వాలన్న ఆశయంతోనే రాజకీయ పార్టీగా రిజిస్టర్‌ చేయించానని తెలిపారు. రాజకీయ పార్టీపై విజయ్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన సొంత నిర్ణయాలనీ చెప్పారు. విజయ్‌కి మంచి చేయాలన్న తలంపుతోనే తాను పార్టీని ప్రారంభించానని చెప్పారు. ఈ విషయాన్ని విజయ్‌ త్వరలో అర్థం చేసుకుంటాడన్నారు. తండ్రీకొడుకుల మధ్య మనస్పర్థలు రావడం, మాట్లాడకుండా ఉండటం సాధారణమైన విషయాలేనని ఆయన చెప్పారు. 

తన ఫోటోని, `ఇయక్కం` పతాకాన్ని ఉపయోగిస్తే చర్యలు తీసుకుంటామని విజయ్‌ హెచ్చరించడంపై చంద్రశేఖర్‌ మాట్లాడుతూ, తనపై చర్యలు తీసుకుని జైలుకి పంపినా బాధపడనన్నారు. విజయ్‌కి అభిమాన సంఘాన్ని మొట్టమొదట ఏర్పాటు చేసింది తానేనని, ఆ తర్వాత `మక్కల్‌ ఇయక్కం`గా మార్చి వ్యవస్థాపకుడిగా ఉన్నానని చెప్పారు. వ్యవస్థాపకుడిగా ఉన్న తాను `విజయ్‌ మక్కల్‌ ఇయక్కం`ను రాజకీయ పార్టీగా మార్చడం తప్పుకాదన్నారు. ప్రస్తుతం తన తనయుడు విజయ్‌కి తెలియకుండానే పలు రహస్య సంఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్‌ జారీ చేసిన ప్రకటన ఆయనే స్వయంగా విడుదల చేసింది కాదని చంద్రశేఖర్‌ పేర్కొన్నారు.

దీనిపై చంద్రశేఖర్‌ భార్య, విజయ్‌ తల్లి శోభాచంద్రశేఖర్‌ స్పందించారు. శుక్రవారం రాత్రి తన భర్త ప్రారంభించిన పార్టీలో తాను సభ్యురాలిగా లేనంటూ స్పష్టంచేశారు. విజయ్‌కి చంద్రశేఖర్‌కు మధ్య మనస్పర్థలున్న మాట వాస్తవమేనన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios