`రుద్రంగి`లోనూ అలాంటి బూతు పదాలే చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో డైలాగ్‌లపై, సెన్సార్ కట్టింగ్‌లపై `రుద్రంగి` చిత్ర దర్శకుడు అజయ్ సామ్రాట్ స్పందించారు.
తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో సినిమాలు ఇటీవల మంచి ఆదరణ పొందుతున్నాయి. ప్రస్తుతానికి అదొక సక్సెస్ ట్రెండ్‌లా మారింది. తెలంగాణ యాస్, బ్యాక్ డ్రాప్ ఆడియెన్స్ ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ సైతం అలాంటి కథలను తెరకెక్కించేందుకు మొగ్గుచూపుతున్నారు. అందులో భాగంగానే మరో తెలంగాణ నేపథ్యంలో `రుద్రంగి` సినిమా తెరకెక్కింది. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎమ్మెల్యే, ప్రజా కళాకారుడు రసమయి బాలకృష్ణ నిర్మించడం విశేషం. ఇందులో జగపతిబాబు, మమతా మోహన్ దాస్, విమలా రామన్, దివి ముఖ్య పాత్రలు పోషించారు.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. చిన్న సినిమా అయినా చాలా పెద్ద రేంజ్ కంటెంట్ ఉందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ గెస్ట్ గా వచ్చి సినిమాపై హైప్ పెంచారు. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్ట్ యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే సినిమాలో చాలా వరకు పచ్చి బూతులున్నాయని బోర్డ్ అభ్యంతరం తెలిపింది. చాలా డైలాగ్‌లు కట్ చేయాలని, లేదంటే బ్యూట్ చేయాలని వెల్లడించింది. తెలంగాణ నేపథ్య చిత్రాలంటే బూతులు కూడా కామన్ అనేలా మేకర్స్ సినిమాలు చేస్తున్నారు. `దసరా` చిత్రంలోనూ కొన్ని బూతు డైలాగులున్నాయి. తర్వాత వాటిని కట్ చేశారు. ఇప్పుడు `రుద్రంగి`లోనూ అలాంటి బూతు పదాలే చాలా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో డైలాగ్‌లపై, సెన్సార్ కట్టింగ్‌లపై `రుద్రంగి` చిత్ర దర్శకుడు అజయ్ సామ్రాట్ స్పందించారు. తెలంగాణ నేపథ్యంలో అప్పటి దొరల కాలం నాటి కథతో రూపొందించిన చిత్రం కావడంతో సహజత్వం కోసం ఆయా డైలాగ్‌లు పెట్టినట్టు తెలిపారు. ఒకప్పుడు దొరలు, పటేళ్లు, రెడ్డీలు ఊర్లల్లో రాజ్యమేలే సమయంలో కింది కులస్థులను బూతులతో పిలిచేవారని, సరదాగా పిలిచినా బూతు పదాలు వాడేవారని, అదేదో వారిపై హక్కులా భావించేవాళ్లని తెలిపారు. అది తెలంగాణలో చాలా ఊర్లల్లో ఉండేదని, ఈ కథ కూడా అప్పటి కాలం నాటిదే కావడం, ఆయా సన్నివేశాలు కూడా ఇందులో ఉన్న నేపథ్యంలో కథ డిమాండ్ మేరకే ఆ పదాలను పెట్టాల్సి వచ్చిందని, అప్పుడు అవి సమాజంలో ఆమోదయోగ్యంగా ఉండేవని, వాటిని ఎదిరించే వాళ్లు లేరని అందుకే ఈ సినిమాలోనూ ఆయా డైలాగ్‌లను వాడాల్సి వచ్చిందన్నారు. ఆ పదాలు లేకపోతే కథకి, సీన్‌కి నిండుతనం ఉండదని, రక్తికట్టదని ఆయన వెల్లడించారు.
ఇక `రుద్రంగి` మూవీ గురించి చెబుతూ, సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నానని తెలిపారు. కొన్ని వందల కథలను మైండ్‌లో ఊహించుకున్నానని, అందులోనుంచి ఒక్క స్టోరీని సినిమాగా తీశానని తెలిపారు. సినిమా బడ్జెట్ తక్కువే అయినా, దానికి పది రెట్లు ఎక్కువ ఔట్ పుట్ వచ్చిందన్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా చేశామని, షూటింగ్ మాత్రం కేవలం 60రోజుల్లోనే చేసినట్టు తెలిపారు. సినిమాలో కంటెంట్ బాగుంటే దాన్ని ఎవరూ ఆపలేరన్నారు. సినిమాపై పాజిటివ్ వచ్చినా, నెగటివ్ వచ్చినా తాను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని, విమర్శలను తాను వెల్‌కమ్ చెబుతానని వెల్లడించారు.

`రుద్రంగి` కథ గురించి దర్శకుడు అజయ్ సామ్రాట్ మాట్లాడుతూ, `నా బాల్యంలో విన్న కథలు, చూసిన పరిస్థితులు, చదివిన చరిత్ర నుంచి ఈ కథను రాసుకున్నాను. పర్టిక్యులర్‌గా ఇక్కడి నుంచి అక్కడి నుంచి తీసుకోలేదు. తెలంగాణ నేపథ్యంలో ఉంటుంది. ఇందులో చూపించిన సమస్యలు ఎక్కడ ఉంటే.. అక్కడి నుంచి ఈ కథను తీసుకున్నట్టే అవుతుంది. ఆ సమస్యలు ఎక్కడ వచ్చినా ఇలాంటి పోరాటాలే జరుగుతాయి. దొరల అణిచివేతల మీద ఇది వరకే చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఇది పూర్తి భిన్నంగా రాబోతోంది. ఎమోషనల్ ఫ్యామిలీ, సోషల్ డ్రామాగా తీశాను. `బాహుబలి`కి పని చేశాను అని నేను ఎక్కడా చెప్పుకోలేదు. నన్ను నేను సెల్ఫ్ ప్రమోట్ చేసుకోవడం నాకు నచ్చదు. `బాహుబలి`, `రాజన్న`కు డైలాగ్ రైటర్‌గా పని చేశాను. రాజమౌళితో నాకు ప్రొఫెషనల్‌గానే పరిచయం ఉంది.
నాకు మమతా మోహన్ దాస్ గారంటే చాలా ఇష్టం. `యమదొంగ` సినిమాలో చేసిన యాక్టింగ్ నాకు ఇష్టం. మంచి సింగర్, డ్యాన్సర్. ఆమెకు `అరుంధతి` మిస్ అయింది. ఈ సినిమాను మిస్ అవ్వకూడదని ఓ వ్యక్తి నాతో అన్నారు. ఆమెకు క్యాన్సర్ అని తెలిసి ఎంతో బాధపడ్డాను. క్యాన్సర్ నుంచి కోలుకున్నారని తెలిసి అప్రోచ్ అయ్యాను. పదేళ్ల నుంచి ఒక్క కాల్ కూడా రాలేదు.. అప్రోచ్ అయినందుకు థాంక్స్ అని అన్నారు. ఐదు నిమిషాలు చెప్పిన కథ విని వెంటనే ఓకే అన్నారు. `రుద్రంగి`లో జగపతి బాబు ఎక్కువగా లీనమయ్యారు. రోజూ పన్నెండు గంటలకు షూటింగ్‌కు రమ్మంటే.. ఉదయం ఎనిమిది గంటలకే వచ్చి సెట్‌లో ఉండేవారు. ఆయన నన్ను ఎక్కువగా నమ్మారు. సినిమా కూడా అంతే బాగా వచ్చింది. కచ్చితంగా ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్ చేసే చిత్రమవుతుంది` అని దర్శకుడు తెలిపారు.
