అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎస్‌.ఎస్‌. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ గురించి ప్రస్తుతం నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా  మరో షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. యాభై  రోజులపాటు హైదరాబాద్‌లో జరిగిన ఈ షెడ్యూల్‌లో ప్రధానమైన భారీ యాక్షన్‌ సీన్స్ షూట్ చేసినట్లు చిత్ర టీమ్ సోమవారం తెలిపింది. తదుపరి షెడ్యూల్‌కు సర్వం సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. షూట్‌ కోసం రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ పుణె  ప్రయాణమౌతున్నట్లు సమాచారం. అక్కడ సుమారు వారం రోజులపాటు షూట్‌ జరగనున్నట్లు తెలుస్తోంది. 

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అలియా భట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రియ, అజయ్‌ దేవగణ్‌, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న హాలీవుడ్‌ నటులు రే స్టీవెన్సన్‌, అలిసన్‌ డూడి ఇటీవల హైదరాబాద్‌ సెట్‌లో తీసుకున్న సెల్ఫీని షేర్‌ చేసిన సంగతి తెలిసిందే.

మరో ప్రక్క ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (తెలుగు) చిత్రంలోని రామ్‌చరరణ్‌, ఎన్టీఆర్‌ పాత్రలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ ఇవ్వనున్నారట. ఈ మేరకు రాజమౌళి అడగ్గానే చిరు కూడా ఓకే చెప్పేశారని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. సదరు వార్తలు విని సినీ ప్రియులు ఎంతో సంతోషిస్తున్నారు.

 పాన్‌ ఇండియన్‌ స్థాయిలో తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హిందీ వెర్షన్‌కి ఆమిర్‌ఖాన్‌ వాయిస్‌ఓవర్‌ అందించనున్నారట. అలాగే మిగిలిన దక్షిణాది బాషలకు సంబంధించి ఆయా ఇండస్ట్రీలకు చెందిన ఓ స్టార్‌ హీరో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి గాత్రం ఇవ్వనున్నట్లు సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. పాన్‌ ఇండియా చిత్రంగా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్న ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.