ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా తెలుగులో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్‌ `ఆర్ ఆర్‌ ఆర్‌`. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కరోనా తర్వాత ఇటీవల ప్రారంభమై కంటిన్యూగా షెడ్యూల్‌ని జరుపుకుంటుంది. ఇటీవలే హైదరాబాద్‌లో ఓ భారీ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుని ఆ వెంటనే పూణేలో చిత్రీకరణ స్టార్ట్ చేసింది. కరోనా వచ్చిన గ్యాప్‌ని పూర్తి చేయాలని రాత్రి పగలు షూటింగ్‌లో గడుపుతున్నారు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు. 

అందులో భాగంగా ప్రస్తుతం మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో చిత్రీకరణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన ఓ చిన్న వీడియోని పంచుకుంది చిత్ర బృందం. ఇందులో పర్వత ప్రాంతంలో రాజమౌళి టీమ్‌ లొకేషన్‌ సెర్చ్ చేయగా, అనంతరం డ్రోన్‌ సహాయంతో షూటింగ్‌ జరిపారు. అలాగే రోడ్డుపై మోటార్‌ సైకిల్‌పై ఓ హీరో వెళ్తుండగా, కారులో కెమెరా పెట్టి చిత్రీకరిస్తున్నారు. 

ఇది చాలా చిన్న షెడ్యూల్‌ అని, అందమైన లొకేషన్‌లో, చాలా అద్భుతంగా ఈ షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతుందని చిత్ర బృందం పేర్కొంది. ఇందులో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ పాల్గొంటున్నట్టు తెలిపారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. చెర్రీకి జోడీగా బాలీవుడ్‌ నటి అలియా భట్‌, ఎన్టీఆర్‌కి జోడీగా బ్రిటీష్‌ నటి ఓలీవియా మోర్రిస్‌ నటిస్తుండగా, అజయ్‌ దేవగన్‌, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

ప్రధాన హీరోల పాత్రలను పరిచయం చేసే క్రమంలో వచ్చే వాయిస్‌ ఓవర్ ని తెలుగులో చిరంజీవితో చెప్పేంచే ప్రయత్నం చేస్తున్నారట. అలాగే హిందీ వెర్షన్‌లో అమీర్‌ ఖాన్‌ చెప్పబోతున్నట్టు తెలుస్తుంది. డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని పది భారతీయ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాని రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు.