ఎన్టీఆర్ కెరీర్ లో డిజాస్టర్ చిత్రం శక్తి. ఆయన కానీ, ఆయన అభిమానులు కానీ ఆ విషయం మర్చిపోరు. ఆ విషయాన్ని ఎన్టీఆర్ ఈ రోజు జరిగిన ఆర్ ఆర్ ఆర్ ప్రెస్ మీట్ లో మరోసారి గుర్తు చేసుకున్నారు. ఇంత ఆనందకరమైన సయమంలో అలాంటి పీడకల లాంటి సినిమాను ఎందుగు గుర్తు చేసుకోవాల్సి వచ్చిందో చూద్దాం...

ఆర్ ఆర్ ఆర్ ప్రెస్ మీట్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మీడియావారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు. ఆ ప్రశ్నలు-సమాధానాల్లో భాగంగా ..‘మగధీర’ తర్వాత చరణ్‌ హిస్టారికల్‌ ఫాంటసీ నేపథ్యం ఉన్న సినిమా చేయలేదు. తారక్‌ కూడా ‘యమదొంగ’ తర్వాత అలాంటి సినిమా చేయలేదు..అన్నారు. ఆ ప్రశ్న పూర్తయ్యేలోపే తారక్‌ అందుకుని“భలేవారండీ శక్తి మర్చిపోయారా...మీరు మర్చిపోయారేమో కానీ నేను మర్చిపోను.” అని నవ్వేసారు.  అదే ప్రశ్నకు చరణ్ అవును అని సమాధానం ఇచ్చారు.

అలాగే నాలుగోసారి జక్కన్నతో సినిమా చేయడం ఈసారి ప్రాణ స్నేహితుడైన చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందాన్ని కలిగించిందని చెప్పుకొచ్చాడు. ఒక ప్రశ్నకు సమాధానంగా ఇది రాజమౌళి కాకుండా ఇంకో దర్శకుడు తీసుకువస్తే మీరిద్దరూ చేసేవారా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ...మరోదర్శకుడితో అయితే అది భవిష్యత్తు గురించి. రాజమౌళి కాబట్టి ఇది జరిగింది. భవిష్యత్తులో మరేదైనా కథతో మమ్మల్ని సంప్రదిస్తే, జరుగుతుందో లేదో చెప్పలేను కానీ. ఇది మాత్రం జక్కన్న వల్లే జరిగింది.  మరో విషయం ఏంటంటే.. ఇది నాకు జక్కన్నకు ఉన్న స్నేహంతో సాధ్యమైంది అన్నారు.