బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్‌. బాహుబలి అంతర్జాతీయ స్థాయిలో ఇమేజ్‌ రావటంతో తన నెక్ట్స్ సినిమాను కూడా అదే స్థాయిలో రూపొందిస్తున్నాడు జక్కన్న. టాలీవుడ్‌ టాప్‌ హీరోలు ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌లు హీరోలుగా పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తయ్యింది.

అయితే ఈ లోగా కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించటంతో షూటింగ్ ఆగిపోయింది. కరోనా ప్రభావం తగ్గకపోవటంతో షూటింగ్ చేసుకునేందుకు చిత్రయూనిట్ చాలా నిబంధనలు విధించింది. ఆ నింబంధలను పాటిస్తూ అవుట్‌ డోర్‌ షూటింగ్‌లు చేయటం అంత సులభం కాదు. దీంతో జక్కన్న షూటింగ్‌ను కొనసాగించేందుకు కొత్త ప్లాన్ లు గీస్తున్నాడు. పీరియాడిక్‌ సినిమా కావటంతో విజువల్‌ ఎఫెక్ట్స్ మీదే ఎక్కువగా ఆధారపడుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా కోసం 18 కోట్లతో ఓ భారీ సెట్‌ను నిర్మించి అందులో షూటింగ్‌ చేశారు. అయితే తదుపరి షెడ్యూల్‌ను కూడా సెట్‌లోనే తెరకెక్కించాలని నిర్ణయించాడట జక్కన్న. అందుకు తగ్గట్టుగా దాదాపు 20 కోట్లతో మరో భారీ సెట్‌ను రూపొందిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆ సెట్‌లోనే షూటింగ్ అంతా పూర్తి చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్‌ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నాడు. ఈ సినిమాను ముందుగా జనవరి 8నే రిలీజ్ చేయాలని భావించినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా కనిపించటం లేదు.