ఆర్ ఆర్ ఆర్ టీం స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. అమృత్ సర్ ప్రమోషనల్ ఈవెంట్ కోసం అక్కడికెళ్లిన ఎన్టీఆర్, రాజమౌళి, చరణ్ స్వర్ణ దేవాలయంలో పూజలు చేసి, భగవంతుడు ఆశీస్సులు అందుకున్నారు.
రాజమౌళి ఎంత శ్రద్ధగా సినిమా తీస్తాడో అంతకంటే శ్రద్దగా ప్రమోషన్స్ చేస్తారు. ఆర్ ఆర్ ఆర్(RRR Movie) లాంటి సినిమాకు అసలు ఈ స్థాయి ప్రచారం అవసరం లేదు. కానీ జక్కన్న తన ఇద్దరు హీరోలను వెంటేసుకొని దేశం మొత్తం తిరుగుతున్నారు. 18వ తేదీ నుండి రోజుకు రెండు ప్రధాన నగరాలు చొప్పున కవర్ చేస్తున్నారు. నిన్న ఢిల్లీలో ఆర్ ఆర్ ఆర్ ప్రమోషనల్ ఈవెంట్ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా అమిర్ ఖాన్ (Amir Khan)హాజరయ్యారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఆర్ ఆర్ ఆర్ ఈవెంట్స్ కి భారీగా జనాలు హాజరవుతున్నారు.
ఢిల్లీ ప్రమోషన్ ఈవెంట్ కూడా సూపర్ సక్సెస్ అని చెప్పాలి. ఈవెంట్ మొత్తం సరదా సరదాగా గడిచింది. ఎన్టీఆర్, చరణ్ అమిర్ ఖాన్ తో నాటు నాటు సాంగ్ స్టెప్ వేయించారు. కాగా నేడు అమృత్ సర్ లో ఆర్ ఆర్ ఆర్ టీమ్ మీడియాతో ముచ్చటించనున్నారు. ఇక ఈవెంట్ కి ముందు రాజమౌళి(Rajamouli), ఎన్టీఆర్, చరణ్ ప్రసిద్ధ స్వర్ణ దేవాలయాన్ని (Golden Temple)సందర్శించారు. వీరి స్వర్ణ దేవాలయ సందర్శనానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ముగ్గురూ సాంప్రదాయ తెలుపు దుస్తులు ధరించి, తలకు కర్చీఫ్ కట్టుకున్నారు.
అమృత్ సర్ ఈవెంట్ ముగియగానే రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ ఈవెంట్ లో ఈ టీం పాల్గొనాల్సి ఉంది. 23న జరిగే హైదరాబాద్ ఈవెంట్ తో ఆర్ ఆర్ ఆర్ ప్రొమోషన్స్ ముగియనున్నాయి. మార్చి 25న మూవీ విడుదలవుతుండగా రెండు రోజుల ముందు వరకు కూడా ఆర్ ఆర్ ఆర్ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా గడపనున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ రాజమౌళి గత చిత్రం బాహుబలి రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఆర్ ఆర్ ఆర్ ఒక విజువల్ వండర్ లో ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. ఇద్దరు ఉద్యమ వీరుల జీవిత కథలను స్ఫూర్తిగా ఫిక్షనల్ కథతో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించారు. డివివి దానయ్య నిర్మించగా... అలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేస్తున్నారు.
