ఆస్కార్ వేడుక కోసం ఇండియన్ ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలోని నాటు నాటు నామినేషన్స్ లో నిలవడమే దీనికి కారణం.  

95వ అకాడమీ అవార్డ్స్ కి సర్వం సిద్ధమైంది. ప్రపంచ సినిమా కేంద్రం లాస్ ఏంజెల్స్ తారలతో నిండిపోయింది. ఇప్పటికే ఆస్కార్ వేడుకలు మొదలయ్యాయి. ఈసారి ఆస్కార్ అవార్డ్స్ భారతీయ సినిమా ప్రియులకు చాలా ప్రత్యేకంగా నిలవనున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి లేటెస్ట్ విజువల్ వండర్ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ బరిలో నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో 'నాటు నాటు' నామినేషన్ దక్కించుకుంది. నాటు నాటు సాంగ్ తో పాటు ఈ విభాగంలో... 'టెల్‌ ఇట్‌ లైక్‌ ఏ ఉమెన్‌' మూవీ నుండి 'అప్లాజ్' సాంగ్, 'బ్లాక్‌ఫాంథర్‌: వకాండ ఫరెవర్‌' చిత్రంలోని 'లిఫ్ట్‌ మీ అప్‌' సాంగ్, 'ఎవ్రీథింగ్‌ ఎవ్రీ వేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌' మూవీకి చెందిన 'దిస్‌ ఈజ్‌ ఏ లైఫ్‌', అలాగే 'టాప్‌గన్‌: మ్యావరిక్‌' చిత్రం నుంచి 'హోల్డ్‌ మై హ్యాండ్‌' సాంగ్స్ నామినేషన్స్ లో నిలిచాయి. 

కాబట్టి నాటు నాటు సాంగ్ కి గట్టిపోటీ ఎదురుకానుంది . ఆల్రెడీ గోల్డెన్ గ్లోబ్ అందుకున్న నాటు నాటు సాంగ్ అవార్డు గెలుచుకునే అవకాశం కలదని పలువురు అంచనా వేస్తున్నారు. ఇక భారతీయ మూవీ ఆస్కార్ బరిలో ఉండగా ఇండియన్స్ ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు . ఈవెంట్ ని ప్రత్యక్షంగా వీక్షించాలని కోరుకుంటున్నారు. మరి ఆస్కార్ వేడుక ఇండియాలో ఎప్పుడు ప్రసారం అవుతుంది? ఎక్కడ చూడవచ్చు? అనే సందేహాలు ఉన్నాయి. 

భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13వ తేదీ ఉదయం 5:30 నిమిషాలకు ప్రసారం అవుతుంది. లాస్ ఏంజెల్స్ లో గల డాల్బీ థియేటర్ వేదిక కానుంది. ఆస్కార్ 2023 ప్రత్యేక్ష ప్రసారం ఏబీసీ నెట్ వర్క్స్ లో చూడవచ్చు. అలాగే యూట్యూబ్, డైరెక్ట్ టీవీ, ఫుబో టీవీ, హులు లైవ్ టీవీలతో పాటు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో కూడా వీక్షించవచ్చు. ఏదైనా లైవ్ చూసి ఆ క్షణాన్ని ఆస్వాదించడం గొప్ప అనుభూతి పంచుతుంది. కాబట్టి నాటు నాటు సాంగ్ కి ఒకవేళ ఆస్కార్ ప్రకటిస్తే ఆర్ ఆర్ ఆర్ టీమ్ సెలబ్రేషన్స్ లైవ్ లో చూసి ఎంజాయ్ చేయవచ్చు. 


నాటు నాటు సాంగ్ కి కీరవాణి సంగీతం అందించారు. రచయిత చంద్రబోస్ సాహిత్యం సమకూర్చారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ఇక కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ డాన్స్ కంపోజ్ చేశారు. నాటు నాటు అత్యంత ప్రాచుర్యం పొందడానికి ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ, ఎన్టీఆర్, చరణ్ ల ఎనర్జిటిక్ స్టెప్స్ కారణమయ్యాయి. మరికొన్ని గంటల్లో ఆస్కార్ భవితవ్యం తేలనుంది. ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ గెలుచుకుంటే అది పెద్ద చరిత్ర అవుతుంది.