దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ తాజాగా సినిమా గురించి అప్డేట్ అందించింది. ఇప్పటివరకు చిత్రీకరించిన సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని పేర్కొన్నారు. రాజమౌళి వ్యక్తిగత కార్యక్రమం కోసం వాషింగ్టన్ వెళ్లడంతో షూటింగ్ కు తాత్కాలిక విరామం ఇచ్చారు. 

రాజమౌళి యుఎస్ నుంచి తిరిగి రాగానే షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఇక చిత్రయూనిట్ మరో ఆసక్తికర అంశాన్ని కూడా పేర్కొంది. నేడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతా రామరాజు జయంతి. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఆయన్ని గుర్తు చేసుకుంది. యంగ్ అల్లూరిగా రాంచరణ్ లుక్ ని చూపించేందుకు ఎంతో ఆసక్తిగా  ఎదురుచూస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. 

స్వాతంత్ర సమరం నేపథ్యంలో తెరక్కుతున్న చిత్రం కావడంతో ఆగష్టు 15న అభిమానులకు ఏదో ఒక సర్ ప్రైజ్ ఉండే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాంచరణ్ కలసి నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో కనీ వినీ ఎరుగని అంచనాలు నెలకొని ఉన్నాయి.