ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా రాజమౌళి రూపొందించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రం మరో ఘనత సాధించింది. వరల్డ్ బెస్ట్ 100 మూవీస్‌లో చోటు సంపాదించింది. 

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా ఇప్పటికే అరుదైన ఘనత సాధించింది. `నాటు నాటు` పాటకిగానూ ఏకంగా ఆస్కార్‌ అవార్డుని సాధించిన విషయం తెలిసిందే. ఇలా ఒక ఇండియన్‌ మూవీకి ఆస్కార్‌ రావడం ఇదే మొదటిసారి.

 ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు దర్శకుడు రాజమౌళి. దీనికోసం ఆయన ఎంతో కృషి చేశాడు. ఇండియన్స్ కి ఒక డ్రీమ్‌గా ఉన్న ఆస్కార్‌ని సాధించి పెట్టాడు. ఆ విషయంలో రాజమౌళి గ్రేట్‌ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఆస్కార్‌ అవార్డు సాధించిన తొలి ఇండియన్‌ మూవీ `ఆర్‌ఆర్‌ఆర్‌`

ఈ సినిమా చాలా రకాలుగా అంతర్జాతీయ ఆడియెన్స్ ని అలరించింది. ముఖ్యంగా ఇందులోని `నాటు నాటు` అనే పాట ప్రపంచ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఎంతో మంది ఈ పాటకు డాన్సులు వేశారు. ఇందులోని యాక్షన్స్ కూడా ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. 

ఆస్కార్‌ కూడా యాక్షన్‌ పరంగా ప్రత్యేకంగా విభాగాన్ని తీసుకొచ్చింది. అందుకు `ఆర్‌ఆర్‌ఆర్‌` ఓ కారణం కావడం విశేషం. మరోవైపు యానిమల్స్ తోనూ ఫైట్‌ చేయించడం ఒక అసాధారణమైన విషయం, దీన్ని ప్రపంచ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేశారు దర్శకుడు రాజమౌళి.

వరల్డ్ బెస్ట్ 100 మూవీస్‌లో `ఆర్‌ఆర్‌ఆర్‌`కి చోటు 

ఈ క్రమంలో ఇప్పుడు ఈ మూవీ మరో అరుదైన ఘనత సాధించింది. వరల్డ్ బెస్ట్ 100 చిత్రాల్లో చోటు సంపాదించింది. `ఇండీ వైర్‌` మీడియా సంస్థ ప్రకటించిన వరల్డ్ బెస్ట్ 100 చిత్రాల్లో `ఆర్‌ఆర్‌ఆర్‌` చోటు దక్కించుకోవడం విశేషం. అయితే 2020 నుంచి 2025 వరకు విడుదలైన సినిమాలను పరిగణలోకి తీసుకుని ఈరేటింగ్‌ని ఇచ్చారు. 

ఇందులో `ఆర్‌ఆర్‌ఆర్‌` 75 వ స్థానంలో నిలిచింది. అన్ని రకాలుగా పవర్‌ ప్యాక్డ్ మూవీగా దీన్ని ఇండీ వైర్‌ విశ్లేషించింది. రక్తికట్టించే పాటలు, దేశభక్తిని నింపే పాటలు, అదే సమయంలో జనాల్లో చైతన్యాన్ని రగిల్చే పాటలంటూ ఇండీ వైర్‌ విశ్లేషకులు అభివర్ణించారు.

`ఆర్‌ఆర్‌ఆర్‌`లోని యానిమల్స్ తో యాక్షన్‌ ప్రత్యేకంగా అభివర్ణించిన ఇండీ వైర్‌

మరోవైపు యాక్షన్‌ సీన్లని ప్రత్యేకంగా ప్రస్తావించారు. యానిమల్స్ తో ఫైట్‌చేయడం హైలైట్‌గా నిలిచిందన్నారు. రామ్‌, భీమ్‌ మధ్య స్నేహం, ఆ తర్వాత వాళ్లిద్దరే శత్రువులుగా మారడం, మరోవైపు చివరికి ఇద్దిరూ కలిసిపోవడంలో ఎమోషన్‌ ఉందని, అదే సమయంలో రెండు పాత్రల్లోని లక్ష్యం స్పష్టంగా ఉందని తెలిపారు. 

దర్శకుడు రాజమౌళి విజన్‌ని వారు ప్రత్యేకంగా అభినందించారు. కథని ఎమోషనల్‌గా, యాక్షన్‌ ప్రధానంగా, సామ్రాజ్యవాదంపై వ్యతిరేకతను చూపించిన తీరు బాగుందన్నారు. ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని దీనికి ఆ స్థానం ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఆరు జాతీయ అవార్డులు గెలుచుకున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా 

ఇక ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా నటించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` మూవీకి రాజమౌళి దర్శకత్వం వహించగా, డీవీవీ దానయ్య నిర్మించారు. ఇందులో అలియాభట్‌, ఒలివియా మోర్రీర్‌ హీరోయిన్లుగా నటించారు. అజయ్‌ దేవగన్‌, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషించారు. 

2022లో ఈ మూవీ విడుదలైంది. కరోనా సమయంలోనూ విడుదలై ఏకంగా రూ. 1200కోట్లు వసూలు చేసింది. `ఆస్కార్‌ అవార్డుతోపాటు ఆరు విభాగాల్లో జాతీయ అవార్డుని సొంతం చేసుకుంది. అనేక ఇతర అవార్డులను దక్కించుకుంది.

ఇక ఇండీ వైర్‌ ప్రకటించిన బెస్ట్ 100 మూవీలో మరో భారతీయ చిత్రం కూడా నిలిచింది. మలయాళానికి చెందిన `ఆల్‌ వీ ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌` అనే సినిమా 58వ స్థానం సొంతం చేసుకోవడం విశేషం.