`ఆర్‌ఆర్‌ఆర్‌` హీరోయిన్‌ అలియా భట్‌, ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా రాజమౌళి, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ రిలాక్స్ అయ్యారు. తన ప్రియుడు రణ్‌బీర్‌ కపూర్‌కి, తానునటిస్తున్న దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీకి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో అలియా హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. తనకు కూడా కరోనా సోకి ఉంటుందని ఆమె టెన్షన్‌ పడ్డారు. ఆమె మాత్రమే కాదు, ప్రస్తుతం అలియా తెలుగులో `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో రామ్‌చరణ్‌తో నటిస్తున్న నేపథ్యంలో రాజమౌళి టీమ్‌ మొత్తం ఆందోళన చెందారు. తమ సినిమా షూటింగ్‌ వాయిదా పడుతుందని టెన్షన్‌ పడ్డారు.

కానీ తాజాగా ఆమె కోవిడ్‌ 19 టెస్ట్ చేయించుకోగా, అది నెగటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాదు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అలియా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని అలియానే స్వయంగా వెల్లడించారు. `డాక్టర్ల సలహా మేరకు కరోనా పరీక్ష చేయించుకోగా నెగటివ్‌గా నిర్ధారణ అయింది. గురువారం నుంచే షూటింగ్‌ పాల్గొంటున్నాను. మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు. కోవిడ్‌ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని క్షేమంగా ఉన్నాను. మీరు కూడా అలాగే ఉండండి` అని తెలిపింది.

ప్రస్తుతం ఆమె హిందీలో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న `గంగూబాయ్‌ కథియవాడి` చిత్రంలో నటిస్తుంది. తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ వారంలోనే ఆమె `ఆర్‌ఆర్‌ఆర్‌`లో జాయిన్‌ కావాల్సి ఉంది. కరోనా నెగటివ్‌ రావడంతో ఈ చిత్రీకరణలో పాల్గొంటారని టాక్‌.  దీంతో ఇప్పుడంతా రిలాక్స్ అయిపోయారు. రామ్‌చరణ్‌, అలియాపై ఓ రొమాంటిక్‌ సాంగ్‌ని షూట్‌ చేయబోతున్నారు రాజమౌళి.