అలియాభట్‌ నటించిన బాలీవుడ్‌ సినిమా `గంగూబాయిః కథియవాడి` చిత్ర ట్రైలర్‌ శుక్రవారం విడుదలైంది. ఇందులో టైటిల్‌ రోల్‌లో అలియాభట్‌ నట విశ్వరూపం చూపించింది. 

`ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie) హీరోయిన్‌ అలియాభట్‌(Alia Bhatt) నటించిన ప్రతిష్టాత్మక చిత్రం `గంగూబాయిః కథియవాడి`(Gangubai Movie). ముంబయిలోని కామటీపురంలో మాఫియా క్వీన్‌గా పాపులర్‌ అయిన గంగూబాయి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ రూపొందించారు. అజయ్‌ దేవగన్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ శుక్రవారం విడుదలైంది. విజువల్‌ వండర్స్ క్రియేట్‌ చేసే భన్సాలీ ఈ చిత్రాన్ని కూడా అదే స్టయిల్‌లో కలర్‌ఫుల్‌గా, కనువిందుగా తెరకెక్కించారని తాజాగా ట్రైలర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. 

ఇక క్యూట్‌ అందాలతో అలరించే Alia Bhatt మేకోవర్‌ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని ట్రైలర్‌లో తెలుస్తుంది. కామటీపురంలో అమావాస్య రాత్రి కూడా అంధకారం ఉండదంటారు. కారణం అక్కడ గంగూ ఉంటుందనే డైలాగ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో వస్తుండగా, అలియాభట్‌ కారు నుంచి దిగుతుండగా ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. ఇందులో అలియా బలవంతంగా వేశ్యగా మారి, అట్నుంచి ఏకంగా నాయకురాలిగా ఎదిగిన తీరుని ఈ ట్రైలర్‌ ఆవిష్కరించింది. ఆమె ముంబయిలోని రెడ్ లైట్ ఏరియాలో నివసిస్తున్న సెక్స్ వర్కర్ల హక్కుల కోసం పోరాడుతుంది.

ఓ బలమైన, సంక్లిష్టమైన పాత్రని అలియాభట్‌ అద్భుతంగా పోషించింది. గంగూబాయి పాత్రకి ప్రాణం పోసిందని చెప్పొచ్చు. ఆమె డైలాగ్‌ డెలివరీ, ఎక్స్ ప్రెషన్స్ అన్‌బిలీవబుల్ గా ఉన్నాయి. అలియా అద్భుతమైన నటి అనే విషయాన్ని చాటి చెప్పాయి. ముంబై యాసలో చెప్పిన 'మీ ఇజ్జత్ ఒకసారి పోతే పోయినట్టే.. కానీ రోజు రాత్రి మేము ఇజ్జత్ అమ్ముతాం' అంటూ చెప్పే డైలాగ్‌ హైలైట్‌గా నిలుస్తుంది. సంజయ్‌ లీలా భన్సాలీ మరోసారి తన మార్క్ విజువల్‌ వండర్‌ని క్రియేట్‌ చేశారు. 

హుస్సేన్ జైదీ రచించిన `మాఫీయా క్వీన్స్ ఆఫ్ ముంబై` పుస్తకంలోని `మేడమ్ ఆఫ్ కామతిపుర` ఆధారంగా ''గంగూబాయి కతియావాడి'' సినిమాని తెరకెక్కించారు. పెన్ స్టూడియోస్ - బన్సాలీ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై జయంతిలాల్ గడా - సంజయ్ లీలా బన్సాలీ సంయుక్తంగా నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో హిందీ తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో ఈ నెల 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అలియాభట్‌ , అజయ్‌ దేవగన్‌ తెలుగులో `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటించడంతో ఈ చిత్రానికి తెలుగు మార్కెట్‌ కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే అలియాభట్‌ మరో తెలుగు సినిమా ఎన్టీఆర్‌తో చేస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తానుహీరోయిన్‌గా నటిస్తున్న విషయాన్ని గురువారం ముంబయిలోని ఓ ప్రెస్‌మీట్‌లో అలియా కన్ఫమ్‌ చేసింది. ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా అలియాభట్‌ కథానాయికగా నటించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది మార్చి 25న విడుదల కాబోతుంది. 

రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అజయ్‌ దేవగన్‌, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌, మేకింగ్‌ వీడియోలు, పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి. జనవరి 7న విడుదల కావాల్సిన `ఆర్‌ఆర్‌ఆర్‌` కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు మార్చిలో తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో భారీగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయబోతున్నారు.