ఆర్ ఆర్ ఆర్ మూవీతో రాజమౌళి మరిన్ని సంచలనాలు సృష్టిస్తాడని అర్థమవుతుంది. విడుదలకు ముందే ఈ మూవీ కొన్ని అరుదైన మైలురాళ్ళు అందుకుంటుంది.
దేశవ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)ఫీవర్ నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా రికార్డు థియేటర్స్ లో ఆర్ ఆర్ ఆర్ మార్చి 25న విడుదల కానుంది. ఎన్టీఆర్, రాజమౌళి(Rajamouli), రామ్ చరణ్ లతో కూడిన ఆర్ ఆర్ ఆర్ టీమ్ అన్ని ప్రధాన నగరాలు తిరిగి ప్రమోషన్స్ నిర్వహించారు.దుబాయ్, ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, వారణాసి, అమృత్ సర్, జైపూర్ వంటి నగరాల్లో ఆర్ ఆర్ ఆర్ ప్రమోషనల్ ఈవెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మార్చి 23న హైదరాబాద్ లో జరిగే ఈవెంట్ తో ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ ముగియనున్నాయి.
మరికొన్ని గంటల్లో ఆర్ ఆర్ ఆర్ మొదటి షో పడిపోనుంది. యూఎస్ లో మార్చి 24 అర్థరాత్రి నుండే ఆర్ ఆర్ ఆర్ షో ప్రీమియర్స్ ప్రదర్శన జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఆర్ ఆర్ ఆర్ $ 3 మిలియన్ వసూళ్లకు చేరుకుంది. ఇది బడా హీరో సినిమాల యూఎస్ లైఫ్ టైం బిజినెస్ కంటే ఎక్కువ కావడం విశేషం. బాహుబలి చిత్రానికి మించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఆర్ ఆర్ ఆర్ కి జరిగింది. ఆర్ ఆర్ ఆర్ బ్రేక్ ఈవెన్ కావాలంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 550 కోట్ల షేర్ వసూలు చేయాలి.
కాగా ఓవర్ సీస్ లో అమెరికా తర్వాత ఆస్ట్రేలియా ఇండియన్ మూవీస్ కి అతిపెద్ద మార్కెట్ గా ఉంది. భారతీయులు అధికంగా ఉండే ఆస్ట్రేలియాలో ఆర్ ఆర్ ఆర్ రికార్డు స్థాయిలో విడుదల అవుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీ విడుదల కానన్ని థియేటర్స్ లో ఆర్ ఆర్ ఆర్ విడుదల అవుతుంది. ఈ విషయాన్ని అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ రాధా కృష్ణ ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేశారు. అలాగే ఆర్ ఆర్ ఆర్ విడుదలవుతున్న థియేటర్స్ లిస్ట్ విడుదల చేశారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ సాధిస్తున్న అరుదైన రికార్డ్స్ లో ఇది కూడా ఒకటి.
దర్శకధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కించారు. ఎన్టీఆర్ (NTR)కొమరం భీం రోల్ చేస్తుండగా, రామ్ చరణ్ (Ram Charan)అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా... అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేశారు. శ్రీయా శరన్, సముద్ర ఖని నటిస్తున్నారు.
