ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలుగు చిత్ర పరిశ్రమకు మధ్య సినీ టిక్కెట్ల యుద్దం జరుగుతోంది. ఎవరు హీరోలో, ఎవరు విలన్లో ఎవరికీ అర్దం కాని సిట్యువేషన్.
మామూలుగా సినిమాల్లో ప్రధాన పాత్రల మధ్య ఎత్తుకు పై ఎత్తులు ఉంటాయి. ఊహించని ట్విస్ట్ లు ,టర్న్ లు ఎన్నో ఉంటాయి. పైనల్ కంక్లూజన్ ..సత్యమేవ జయితే..నిజాయితీ గల వాడే జయిస్తారు అని ముగుస్తుంది. ఇప్పుడు సినీ టిక్కెట్ల యుద్దం జరుగుతోంది. ఎవరు హీరోలో, ఎవరు విలన్లో ఎవరికీ అర్దం కాని సిట్యువేషన్. ఈ యుద్దంలో చివరకు గెలిచేదెవరో..న్యాయం ఎవరి వైపు ఉందని తేలుతుందో ..ఫైనల్ కంక్లూజన్ ఏమిటో అనేది సామాన్య ప్రేక్షకుడుకి ఓ అంతు చిక్కని ప్రశ్నలా మారింది.
గత కొద్ది నెలలుగా ఆంధ్రాలో టిక్కెట్ల వివాదం జరుగుతోంది. టాలీవుడ్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య ఇదో వార్ లా మారింది. అచ్చ తెలుగు సినిమాల్లో ఉండే ఎత్తుకు పై ఎత్తులు, ట్విస్ట్ లు ఈ వివాదంలో చోటు చేసుకుంటున్నాయి. ఏ వివాదం ఎటు నుంచి ఎక్కడకి వెళ్లి ముగుస్తుందో అర్దం కాని సిట్యువేషన్ నెలకొంది. గతంలో పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా విడుదల సమయంలో ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి, బెనిఫిట్ సినిమాలు వేయడానికి జగన్ ప్రభుత్వం అనుమతించలేదు.
దాంతో వివాదం కోర్టుకు ఎక్కింది. మూడు రోజుల పాటు ధరలు పెంచుకోవచ్చునని హైకోర్టు తీర్పు చెప్పింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై వైఎస్ జగన్ ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం టికెట్ల ధరలు పెంచొద్దని ఆదేశించింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి రెండు రోజులు మాత్రమే టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం వుందని తెలిపింది. దీంతో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కల్యాణ్ అభిమానులు పలు చోట్ల ఆందోళనలకు దిగారు. థియేటర్లపై దాడులు కూడా చేశారు.
ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా వకీల్ సాబ్ వివాదంలో పవన్ కల్యాణ్ కు మద్దతుగా నిలిచారు. తాము వ్యాపారాలు చేసుకోకూడదా అని ఆయన వ్యాఖ్యానించారు. మళ్లీ పెద్ద సినిమాల రిలీజ్ అవుతున్న ఈ సమయంలోనూ అదే సీన్ రిపీట్ అవుతోంది.
'రిపబ్లిక్' సినిమా ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఏపీలో టికెట్ రేట్స్ ఇష్యూ గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వంతో పాటు ఇండస్ట్రీ పెద్దల తీరుని కూడా ప్రశ్నించారు పవన్. ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. పవన్ చేసిన కామెంట్స్ కి తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ఇండస్ట్రీ పెద్దలంతా వెళ్లి ఏపీ మంత్రుల చుట్టూ తిరిగారు.
అయినప్పటికీ.. టికెట్ రేట్స్ విషయంలో ఇండస్ట్రీకి అనుకూలంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం డిసైడ్ చేసే రేట్లకే టికెట్లను అమ్మాలని.. అది కూడా ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థలోనే టికెట్స్ బుక్ చేయాల్సి ఉంటుందని జీవో జారీ చేసింది. ఇప్పటికీ ఈ విషయంపై అప్పుడప్పుడు దర్శకనిర్మాతలు, హీరోలు మాట్లాడుతూనే ఉన్నారు.
రీసెంట్ గా పవన్ కళ్యాణ్ మరోసారి ఈ ఇష్యూని రైజ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉక్కు కార్మికులు చేపట్టిన పోరాటానికి మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీక్షకు దిగారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ దీక్ష చేపట్టారు. ఇదే సమయంలో ఆయన సినిమా టికెట్లు, థియేటర్ల వ్యవహారానికి సంబంధించి ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన సినిమాలను ఆపి ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి వైసీపీ సర్కార్ ప్రయత్నిస్తోందని పవన్ ఆరోపణలు చేశారు. అలాంటి బెదిరింపులకు తాను భయపడనని పవన్ స్పష్టం చేశారు. తనతో పంతానికి దిగితే తన సినిమాలను ఫ్రీగా ఆడిస్తానంటూ పవన్ ప్రకటించారు. సినిమా టికెట్స్ విషయంలో ట్రాన్స్పరన్సీ లేదంటున్నారని.. మరి ప్రభుత్వం అమ్మే మద్యానికి ట్రాన్స్పరన్సీ ఉందా అని ప్రశ్నించారు పవన్.
ఇక ఇప్పటి విషయానికి వస్తే..
సినిమా టికెట్ ధరలను నియంత్రిస్తూ ఏప్రిల్ 8న జీవో నెంబర్ 35ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ థియేటర్ల యజమానులు, ప్రొడ్యూసర్లు కోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై విచారణ జరిపిన తర్వాత.. జీవోను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు సింగిల్ బెంచ్ జడ్జి. జీవో 35కు ముందు అనుసరించిన విధానంలోనే టికెట్ ధరలను నిర్ణయించుకునేందుకు కోర్టును ఆశ్రయించిన థియేటర్ యాజమానులకు వెసులుబాటు కల్పించింది కోర్టు.
అయితే హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తరుపున హోంశాఖ ముఖ్య కార్యదర్శి డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
కొత్త సినిమాలు విడుదలయ్యే సమయంలో టికెట్స్ రేట్స్ పెంచుకునే అవకాశం థియేటర్ యజమానులకు ఉంటుందని.. కానీ దీంతో సామాన్యులపై అధిక భారం పడుతుందని ప్రభుత్వం తరపు న్యాయవాది ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. థియేటర్ల యజమాన్యాలు టికెట్ ధరల ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్ ముందుంచాలని.. ఆ తర్వాత ఆయనే నిర్ణయం తీసుకుంటారని సూచించింది. ఇక అనంతరం రెండు వైపుల వాదనలు ఉన్న హైకోర్టు.. తీర్పుని రేపటికి వాయిదా వేసింది
ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమాల టికెట్ ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 35పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. థియేటర్ల యజమాన్యాలు టికెట్ ధరల ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్ ముందుంచాలని.. ఆ తర్వాత ఆయనే నిర్ణయం తీసుకుంటారని సూచించింది. అలాగే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ నేపధ్యంలో చివరకు ఈ వివాదం ఎక్కడ ముగుస్తుందో ..గెలుపు ఎవరిని వరిస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
