'జబర్దస్త్' షోలో ఎన్నో ఏళ్లుగా జడ్జిగా కనిపిస్తోన్న రోజా ఇక ఆ షోలో కనిపించేది కొన్నిరోజులేనా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది నిజమేనంటూ థియరీలు చెబుతున్నారు. ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆమె ఈ షోని కంటిన్యూ చేసుకున్నారు.

మధ్యల్లో ఎన్నికల సమయంలో కొంత గ్యాప్ ఇచ్చినప్పటికీ ఎన్నికల్లో గెలిచి మళ్లీ షోలో బిజీ అయ్యారు. అయితే ఈసారి రోజాకి మంత్రివర్గంలో ఛాన్స్ లభించే అవకాశం ఉందని సమాచారం. అది కుదరకపోతే స్పీకర్ గా ఆమెని ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. 

ఈ రెండింట్లో ఏం జరిగినా ఆమె 'జబర్దస్త్' షోకి వచ్చే అవకాశం లేదని అంటున్నారు. స్పీకర్ పోస్ట్ లో ఉన్నా.. మంత్రి పదవిలో ఉన్నా.. ఆమె 'జబర్దస్త్' షోకి టైం కేటాయించలేదు. మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే ఆమె ప్రజాసేవకే అంకితం కావాల్సివుంటుంది. పోనీ స్పీకర్ గా ఉండి అసెంబ్లీ సమావేశాలు లేని సమయంలో షూటింగ్ కి వెళ్దామంటే.. ఆ పదవికి గౌరవం ఇవ్వాలంటే కచ్చితంగా ఇలాంటి ప్రోగ్రామ్ లు ఆపేయాల్సివుంటుంది. 

ఇవన్నీ ఎలాగోలా తట్టుకొని షో కంటిన్యూ చేస్తే తెలుగుదేశం పార్టీ నుండి రోజా విమర్శలు ఎదుర్కోవాల్సివస్తుంది. ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే గనుక రోజా ఇక 'జబర్దస్త్' షోలో కనిపించడం కష్టమేనని అంటున్నారు.