టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అబుదాబిలో షూట్ చేసిన సన్నివేశాలు ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు.

అంతకంటే హైలైట్ సన్నివేశం సినిమాలో మరొకటి ఉందట. అదేంటంటే భారీ చోరీ సీన్ అని తెలుస్తోంది. ఓ నగల షాపులో బంగారం మొత్తం కొట్టేయాలని హీరో ప్లాన్ చేస్తాడు. కానీ తన ప్రమేయం లేకుండా ఆ బంగారం మొత్తం కొట్టేయడానికి ప్లాన్ చేస్తాడట. మొత్తం నగలన్నీ వచ్చి తన కారులో పడేట్లు చేసుకుంటాడని తెలుస్తోంది.

ఇది వరకు వచ్చిన సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు ఉన్నట్లుగా అనిపిస్తున్నా.. ఈ రాబరీ సీన్ ని హైటెక్ రేంజ్ లో చిత్రీకరిస్తున్నారట. తెరపై హీరో కనిపించడానికి వచ్చే ఈ ఓపెనింగ్ సీన్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

దీనికోసం రామోజీ ఫిలిం సిటీలో భారీగా ఓ నగల షాప్ సెట్ ని ఏర్పాటు చేశారు. ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు యూరప్ లో చిత్రీకరించాల్సివుంది. కానీ ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలోనే యూరప్ బ్యాక్ డ్రాప్ తో సెట్ వేసి సదరు సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.