గత కొద్ది రోజులుగా దర్శకుడు పూరి జగన్నాథ్ కన్నా ఎక్కువగా ఊగిపోతున్నారు డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ. తన శిష్యుడు ఎట్టకేలకు హిట్ కొట్టాడన్న ఆనందం తో ఆయన ఎడాపెడా పార్టీలు చేసేసుకుంటున్నారు. థియోటర్స్  వద్ద హల్ చల్ చేస్తున్నారు. పూరీ, ఛార్మి, నిధి అగర్వాల్‌తో కలసి ఫుల్లుగా మందు పార్టీ చేసుకుని, ఆ ఫొటోలు వీడియోలు పోస్ట్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నాడు. సినిమా చూడడానికి ట్రిపుల్ రైడింగ్ చేసి.. ఆ ఫొటోలు వీడియోలు ట్విట్టర్‌లో పోస్ట్ చేసి పోలీసులకే సవాల్ విసిరాడు.  ఇలా రెచ్చిపోతున్న రామ్ గోపాల్ వర్మ మనస్సులో వేరే ఆలోచన ఉందని సమాచారం.

అది మరేదో కాదు...ఆయన ఇస్మార్ట్ శంకర్ హీరో రామ్ తో సినిమా చేయాలనుకుంటున్నారట. ఈ మేరకు పూరి జగన్నాథ్ ద్వారా రామ్ తో మాట్లాడించాడని చెప్తున్నారు. అయితే రామ్ ఇంకా సై అనలేదట. తను యూరప్ టూర్ వెళ్లి వచ్చాక ఏ విషయం చెప్తానని అన్నారట.  అయితే తను చెప్పిన కాన్సెప్టు ఖచ్చితంగా రామ్ కు నచ్చుతుందనే నమ్మకంతో వర్మ ఉన్నారట. అలాగే రామ్ సైతం అవుటాఫ్ ది భాక్స్ ఐడియాలతో సినిమాలు చేసి హిట్ కొట్టాలనే నిర్ణయానికి వచ్చారట.

ఈ క్రమంలో కొత్త తరహా కథలను, డైరక్టర్స్ ని ఆహ్వానిస్తున్నారట. ఇంతవరకూ బాగానే ఉంది.  కానీ ఇదంతా గమనిస్తున్న రామ్ అభిమానులు మాత్రం కంగారు పడుతున్నారు. రామ్ గోపాల్ వర్మతో రామ్ సినిమా చేసేస్తాడా అని భయపడుతున్నారు. రామ్ గోపాల్ వర్మ తో రిస్క్ చేయటం అంటే రస్కు తిన్నట్లే అని అంటున్నారు. మొదట్లో ఉన్న ఉత్సాహం సినిమా పూర్తయ్యే దాకా ఉండదని చెప్తున్నారు. చుద్దాం మరి ఏం జరగనుందో.