ఓ ఇంటర్వ్యూలో కీరవాణి ఈ ఆస్కార్‌ అవార్డుపై స్పందించారు. తనకు ఆస్కార్‌ రావడంపై తన ఆనందాన్ని పంచుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  దీనిపై వర్మ ఫన్నీగా స్పందించారు.

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇటీవలే ఇండియాకి ఆస్కార్‌ తీసుకొచ్చారు. మొదటి సారి ఓ ఇండియన్‌ మూవీకి, అది కూడా తెలుగు సినిమాకి ఆస్కార్‌ వరించడంలో ఆయన పాత్ర కీలకమని చెప్పొచ్చు. ఆయన సంగీతం అందించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలోని `నాటునాటు` పాటకి ఆస్కార్‌ అవార్డు దక్కింది. లిరిక్‌ రైటర్‌ చంద్రబోస్‌ రాసిన ఈ పాటకి ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో అకాడమీ అవార్డు వరించింది. 

ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో కీరవాణి ఈ ఆస్కార్‌ అవార్డుపై స్పందించారు. తనకు ఆస్కార్‌ రావడంపై తన ఆనందాన్ని పంచుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు మొదటి ఆస్కార్‌ రామ్‌గోపాల్‌ వర్మ అని చెప్పి షాకిచ్చారు. ఇప్పుడొచ్చిన ఆస్కార్‌ తనకు రెండోవది అని తెలిపారు. `చాలా మంది మేకర్స్(51 మంది) నా మ్యూజిక్‌ క్యాసెట్‌ని చెత్తకుండీలో పడేశారు. కొత్తవాడిని కావడంతో, నేను ఎవరో తెలియకపోవడంతో వాళ్లు ఎవరూ నా పాటలను వినేందుకు ఇష్టపడలేదు. విని నచ్చినా అవకాశాలు ఇవ్వలేదు. అలాంటిది నా మ్యూజిక్‌ విని తన `క్షణక్షణం` చిత్రంలో అవకాశం ఇచ్చాడు రామ్‌గోపాల్‌ వర్మ. `శివ` చిత్రం వర్మకి ఆస్కార్‌ అయినా, నాకు వర్మ ఆస్కార్‌ లాంటి వారు, ఆయన అవకాశం ఇచ్చిన తర్వాతనే నాకు సినిమా అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు ఆస్కార్‌ వచ్చింది` అని చెప్పారు కీరవాణి. 


ఆ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. ఇది రామ్‌గోపాల్‌ వర్మకి చేరింది. దీంతో దీనిపై వర్మ ఫన్నీగా స్పందించారు. తనని ఇలా పొగుడుతుంటే చనిపోయిన ఫీలింగ్‌ కలుగుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. కీరవాణి వీడియో క్లిప్‌ని షేర్‌ చేస్తూ, `కీరవాణి ఇలా మాట్లాడుతుంటే నాకు చనిపోయిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఎందుకంటే ఎవరైనా చనిపోయిన తర్వాతనే ఇలా పొగుడుతుంటారు` అని ట్వీట్‌ చేశారు ఆర్జీవీ. దీంతో ఈ ట్వీట్‌ మరింత వైరల్‌గా మారింది. వర్మ ఎప్పటిలాగే తనదైన స్టయిల్‌లో స్పందించి ఆకట్టుకున్నారు. 

Scroll to load tweet…

ఏదేమైనా వర్మ ఓ గొప్ప డైరెక్టర్‌. తెలుగు సినిమాలో కొత్త ఒరవడి సృష్టించారు. ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచారు. ప్రయోగాలు చేశారు. కానీ ఇప్పుడు ఆయన వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుండటం విచారకరం. ఆయన సినిమాలు థియేటర్లో పెద్దగా ఆడటం లేదు, పైగా డైరెక్టర్‌గా ఆ క్వాలిటీ ఉండటం లేదు. రియలిస్టిక్‌ సంఘటనలతోనే సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. మరోవైపు వివాదాస్పద కామెంట్లతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.