టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు, సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతంలో రౌడీ సినిమాకు కలిసి పని చేసారు. మోహన్ బాబు కుటుంబంతో వర్మకు మంచి అనుబంధమే ఉంది. అయితే ఈ మధ్యకాలంలో వీళ్లిద్దరూ కలవటం జరగలేదు. ఫోన్ లలో మాట్లాడుకున్నారేమో కానీ ...ఎదురెదురుగా కూర్చుని అయితే మాట్లాడుకోలేదు. తాజాగా పరస్పరం పూర్తిగా భిన్నమైన వ్యక్తులైన వీళ్లిద్దరూ కలిసారు.

ప్రస్తుతం  తెలుగు రాజకీయాల్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో మోహన్ బాబును రామ్ గోపాల్ వర్మ కలవడం చర్చనీయాంశంగా మారింది. కొన్నిరోజుల క్రితమే ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం మోహన్ బాబు సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. మరోవైపు, వర్మ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో చంద్రబాబు వర్గీయులకు విలన్ గా మారారు.  ఈ నేపథ్యంలో మోహన్ బాబును ఆర్జీవీ కలవడం రకరకాల వార్తలకు తావిస్తోంది. 

అయితే మోహన్ బాబు పనిగట్టుకుని మరీ వర్మను కలవటం వెనక ఓ అవసరం ఉందంటున్నారు. తాజాగా వర్మ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీస్ ఎన్టీఆర్ లో తన పాత్ర ఎలా డిజైన్ చేసారో తెలుసుకోవటానికే అంటున్నారు. అంతేకాకుండా తన పాత్ర మరీ నెగిటివ్ గా అనిపించేలా ఉండే సీన్స్, డైలాగులను తీసేయమని రిక్వెస్ట్ చేయటానికే వచ్చాడంటున్నారు. అయితే వర్మ ..మోహన్ బాబుకు మైనస్ అయ్యేలా సీన్స్ ఉండవని, వర్రీ కావద్దని చెప్పినట్లు సమాచారం. 

ఇక మోహన్ బాబు, తను  ఓ టేబుల్ వద్ద కూర్చుని సీరియస్ గా డిస్కస్ చేస్తున్న ఫొటోను వర్మ ట్వీట్ చేశారు. అంతేకాదు, చంద్రబాబు ఇలాంటివాడా! అంటూ విస్మయం వ్యక్తం చేస్తూ కొన్ని ఎమోజీలను కూడా తన ట్వీట్ లో చొప్పించారు. ఈ సందర్భంగా వెన్నుపోటుదారులను చెంపకేసి కొట్టాలనిపిస్తోందని, మోహన్ బాబు గారిని అభినందించాలనిపిస్తోందని పేర్కొన్నారు. 

మోహన్ బాబు సర్ కనీసం మీరైనా ఇప్పుడు ఎన్సీబీఎన్ (చంద్రబాబు) గురించి అసలైన నిజాలు చెప్పడం సంతోషం కలిగిస్తోందని వర్మ వ్యాఖ్యానించారు.  అయితే అసలు నిజం అది కాదని, లక్ష్మీస్ ఎన్టీఆర్ లో పాత్ర గురించే అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.