ఒక్కసారే ఎవరెస్టు ఎక్కేయాలన్నట్లు ఉంది అల్లు అర్జున్ తీరు. వంద కోట్ల సినిమా ఒకటి ఖాతాలో పడిందో లేదో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అల్లు అర్జున్ తీసుకున్న తాజా నిర్ణయం ఫ్యాన్స్ ని కూడా ఆందోళలనకు గురి చేస్తుంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్నప్పుడు పాన్ ఇండియా మూవీగా విడుదల చేసే ఆలోచన లేదు. అల వైకుంఠపురంలో మూవీ భారీ విజయం సాధించడంతో పాటు రెండు వందలకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. 


దీనితో అల్లు అర్జున్ పాన్ ఇండియా ఇమేజ్ పై కన్నేశాడు. పుష్ప మూవీ పాన్ ఇండియా మూవీగా ప్రకటించేశారు. అంత వరకు ఓకే... తాజాగా దీన్ని రెండు పార్ట్స్ గా విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కథ నిడివి రీత్యా పుష్ప రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. మొదటి పార్ట్ షూటింగ్ 80% శాతం వరకు పూర్తి అయ్యిందని, మిగిలిన 20% షూటింగ్ పూర్తి చేసి విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలియజేస్తున్నారు. 


పుష్ప రెండు భాగాలుగా విడుదల చేయాలన్నది కూడా ప్రాజెక్ట్ మధ్యలో తీసుకున్న నిర్ణయమే. బలమైన కథ, ముగింపు లేకుండా ఓ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయడం సాహసమే అని చెప్పాలి. మొదటి భాగం ఒకేవేళ ప్లాప్ అయితే రెండవ భాగంపై ప్రేక్షకులకు ఆసక్తి ఉండదు. దానికి తోడు ఏకంగా రూ . 300కోట్ల బడ్జెట్ వరకు రెండు భాగాలకు పెంచేశారు. అంటే పుష్ప హిట్ వెంచర్ కావాలంటే రూ. 500 కోట్ల వసూళ్ల వరకు రాబట్టాలి. అల్లు అర్జున్ మార్కెట్ రీత్యా ఈ స్థాయి వసూళ్లు సాధ్యమేనా అనేది పెద్ద ప్రశ్న. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తీయడం వలన ఆ మూవీ ఆదరణ కోల్పోయింది. అన్నీ చిత్రాలు బాహుబలి మాదిరి సక్సెస్ కావడం కష్టమే. కాబట్టి అల్లు అర్జున్-సుకుమార్ పుష్ప మూవీతో పెద్ద రిస్క్ చేస్తున్నారనేది వాస్తవం.