రెబల్ స్టార్ ప్రభాస్ మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించేశారు. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో  కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. సలార్ అనే పవర్ టైటిల్ ని ఈ చిత్రానికి ఫిక్స్ చేశారు. 'మోస్ట్ వైలెంట్ మెన్ కూడా సలార్ ని వైలెంట్ అని పిలుస్తారు'  అని ఓ డేంజరస్ ట్యాగ్ కూడా యాడ్ చేయడం జరిగింది. బ్లాక్ అవుట్ ఫిట్ ధరించిన ప్రభాస్ మెషిన్ గన్ పై చేతిని ఉంచి, రాయల్ పోజిచ్చారు. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు ఆకాశానికి పెంచేశారు నిర్మాతలు. 

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ మూవీ చేస్తున్నాడని చాలా కాలంగా కథనాలు రావడం జరిగింది. మొత్తంగా నేటితో దీనిపై నిర్మాతలు స్పష్టత ఇచ్చారు. కెజిఎఫ్ నిర్మాతలు హోమబుల్ ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కెజిఎఫ్ మూవీలో రాఖీ భాయ్ గా యష్ ని ఓ రేంజ్ లో చూపించిన ప్రశాంత్ నీల్, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ని  ఏ రేంజ్ లో ప్రజెంట్ చేయనున్నాడనే ఆసక్తి ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ లో పెరిగిపోయింది. 

ఇప్పటికే రాధే శ్యామ్ తో పాటు నాగ్ అశ్విన్ మరియు దర్శకుడు ఓమ్ రౌత్ తో రెండు భారీ ప్రాజెక్ట్స్ ప్రకటించిన ప్రభాస్ మూడో  చిత్రం ఆ రెండింటికి మించిన క్రేజీ కాంబినేషన్ సెట్ చేశారు. పాన్ ఇండియా స్టార్ గా వందల కోట్ల మార్కెట్ కలిగిన ప్రభాస్ కోసం, దర్శకులు ఎగబడుతున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 పూర్తి చేసే పనిలో ఉన్నారు. సలార్ మూవీని ప్రశాంత్ ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడో చూడాలి.