ఒకప్పుడు మణిరత్నం క్రేజ్ తో పోల్చితే ఇప్పుడు బాగా తగ్గిందనే చెప్పాలి. మధ్యలో 'ఓకే బంగారం' సినిమాతో ఫామ్ లోకి వచ్చాడనుకుంటే.. 'చెలియా'తో మరో డిజాస్టర్ అందుకున్నాడు. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న మణిరత్నం ఇప్పుడు ఓ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అదే 'చెక్క చైవంత వానమ్'.

అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, శింబు, విజయ్ సేతుపతిలు ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో జ్యోతిక, అదితి రావు హైదరి హీరోయిన్లుగా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో ఓ పాత్ర కోసం మణిరత్నం.. విజయ్ దేవరకొండని సంప్రదించారట. కానీ ఆ ఆఫర్ ని రిజక్ట్ చేశాడు విజయ్. మణిరత్నం లాంటి దర్శకుల సినిమాల్లో కనిపించాలని హీరోలు ఆరాటపడతారు.

ఆయన క్రేజ్ తగ్గినా.. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఆయనపై గౌరవం మాత్రం తగ్గలేదు. కానీ విజయ్ దేవరకొండ నో చెప్పడం వెనుక కొన్ని కారణాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. రెమ్యునరేషన్ తక్కువగా ఆఫర్ చేయడం, నలుగురు హీరోల్లో తాను ఒకడిగా కనిపించడం ఇష్టంలేకపోవడంతో ఆఫర్ ని రిజక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ పాత్రలోనే శింబు నటిస్తున్నాడని టాక్. ఈ సినిమాను 'నవాబ్' పేరుతో తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు.