ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తమ టీమ్ లో ఉంటే తమ సినిమా హిట్ అని స్టార్ డైరక్టర్స్ సైతం భావిస్తూంటారు. అందుకోసం ఎంత రెమ్యునేషన్ అయినా ఇవ్వటానికి సిద్దపడుతూంటారు. అలాంటిది దేవిశ్రీప్రసాద్ ని కాదని, ఆయన తో సినిమా వద్దనుకునేవాళ్లు ఉంటారా...ఉన్నారని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినపడుతున్నాయి. ఆ దర్శకుడు మరెవరో కాదు హరీష్ శంకర్. ఆయన తాజాగా డైరక్ట్ చేస్తున్న వాల్మీకి చిత్రంకు మొదట దేవిశ్రీనే సంగీత దర్శకుడు. కానీ ఇప్పుడాయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. 

హరీష్ శంకర్ కెరీర్ లో సూపర్ హిట్ అయిన గబ్బర్ సింగ్ కు బ్యాక్ బోన్ గా నిలబడింది దేవిశ్రీప్రసాద్ సంగీతమే అనేది ఎవరైనా ఒప్పుకునే సత్యం. అయితే ఆయన పాటలు గత కొంతకాలంగా జనాలకు కనెక్ట్ కావటం లేదు. రీసెంట్ గా వచ్చిన మహర్షి సైతం ఆడియో పరంగా సూపర్ హిట్ కాలేదు. అంతకు ముందు వచ్చిన చిత్రలహరి చిత్రం ఆడియో పరంగా హిట్ కాలేదు. 

దాంతో హరీష్ శంకర్ తన సినిమాకు అలాంటి పరిస్దితి రాకూడదని దేవిశ్రీప్రసాద్ పై ఒత్తిడి తెస్తున్నారట. అంత త్వరగా ఏ ట్యూన్ ని ఓకే చేయటం లేదట. దాంతో క్రియేటివ్ డిఫరెన్స్ లు ఇద్దరికీ వస్తున్నాయని భావించిన దేవి తాను ప్రాజెక్టు నుంచి తప్పుకుంటా అన్నారట. దాంతో ఆ ప్లేస్ లోకి మిక్కీజే మేయర్ వచ్చారని వినికిడి. అయితే ఈ మ్యాటర్ కేవలం రూమరా లేక నిజమా అనేది ఇంకా తెలియలేదు. అఫీషియల్ గా ఎటువంటి ప్రకటనా రాలేదు. 

వరుస హిట్స్ తో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో వరుణ్ తేజ్‌ ప్రస్తుతం వాల్మీకి సినిమాలో నటిస్తున్నాడు. తమిళ సూపర్‌ హిట్ జిగర్‌తాండకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు హరీష్‌ శంకర్‌ దర్శకుడు. ప్రస్తుతం రెగ్యుల్  షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా లో హీరోయిన్‌గా నటిస్తున్న పూజా హెగ్డే ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా ప్రచారం జరిగింది.