రూమర్స్ ఎక్కడ పుడతాయో ఎలా వైరల్ అవుతాయో తెలియదు గాని ఒక్కోసారి సినిమా ప్రముఖులకు ఊహించని తలనొప్పులను తెస్తాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల విషయంలో రూమర్స్ డోస్ రోజురోజుకి ఎక్కువవుతోంది. చివరికి చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చేవరకు అభిమానులకు తెలియడంలేదు. 

రీసెంట్ గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాపై కూడా ఒక రూమర్ తెగ హల్చల్ చేసింది. దీంతో చిత్ర యూనిట్ ఫైనల్ గా క్లారిటీ ఇవ్వక తప్పలేదు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ తన 12వ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా జనవరి రిలీజ్ కానుందని చిత్ర యూనిట్ ముందు నుంచి చెబుతూ వస్తోంది. 

అంతే కాకుండా షెడ్యూల్స్ లో ఏ మాత్రం తేడా రాకుండా నిర్విరామంగా కష్టపడుతున్నారు. సంక్రాంతికి సినిమా రిలీజ్ ఉండాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఇటీవల సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడిందనే రూమర్ అభిమానులను కన్ఫ్యూజన్ కి గురి చేసింది. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా రిలీజ్ ఉంటుందని అనడంతో దానయ్య ప్రొడక్షన్ టీమ్ అధికారికంగా స్పందించింది. 

సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పులు లేవని ముందుగా అనుకున్నట్టుగా సంక్రాంతికే రామ్ చరణ్ బోయపాటి కాంబినేషన్ లో వస్తోన్న మాస్ ఎంటర్టైనర్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు చెప్పేశారు. మరికొన్ని రోజుల్లో సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.