రవితేజ హీరోగా నటిస్తున్న `టైగర్‌ నాగేశ్వరరావు` మూవీ శనివారం ఉగాది పండుగ సందర్భంగా ప్రారంభమైంది. చిరంజీవి చేతుల మీదుగా ఈ చిత్ర ప్రీ లుక్‌ని విడుదల చేశారు. 

రవితేజ(Raviteja) పాన్‌ ఇండియా స్టార్‌ ట్యాగ్‌పై కన్నేశారు. తాజాగా ఆయన `టైగర్‌ నాగేశ్వరరావు`(Tiger Nageswararao) పేరుతో సినిమా చేస్తున్నారు. దీన్ని పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ సినిమా ఉగాది పండగ పర్వదినం సందర్భంగా శనివారం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని నోవాటెల్‌ గ్రాండ్‌గా ప్రారంభమైంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) గెస్ట్ లుగా ఈ సినిమా ఓపెనింగ్‌ జరుపుకుంది. రవితేజ, హీరోయిన్లపై చిరంజీవి క్లాప్‌నిచ్చారు. అంతేకాదు టైటిల్‌ పోస్టర్‌ ప్రీ లుక్‌ని విడుదల చేశారు. 

Scroll to load tweet…

ట్రైన్‌ పట్టాలపై వెనకాల ట్రైన్‌ వస్తుందగా, కసీగా, కోపంతో కొరడా పట్టుకుని నిల్చొని ఉన్న రవితేజ ప్రీ లుక్‌ గూస్‌బమ్స్ తెప్పిస్తుంది. వైరల్‌ అవుతుంది. స్టూవర్ట్‌పురంలో గజదొంగగా పేరొందిన టైగర్ నాగేశ్వరరావు నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ కృతి సనన్ సోదరి నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తుండగా అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రవితేజ కెరీర్‌లో తొలి పాన్‌ ఇండియా చిత్రమిది. 

Scroll to load tweet…

సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, `కరోనాకి ముందు దర్శకుడు వంశీ నాకు ఈ చిత్ర కథ వినిపించారు. చాలా బాగుందనిపించింది. అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్ ఉన్నాయి. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ సినమా నేను చేయలేదు. రవితేజ ఈ కథకి సరిగ్గా సరిపోతాడనిపించింది. టైగర్‌ నాగేశ్వరరావు గురించి చిన్నప్పుడే ఎన్నో కథలు విన్నాను. చీరాల, పేరాలలో మా నాన్నగారు ఉద్యోగం చేస్తున్నప్పుడు పక్కనే ఉండే స్టూవర్ట్ పురంలోని ప్రజలు అతడిని ఒక హీరోలా చూసేవారు. ఒక దొంగని ఎందుకు హీరోలా చూస్తున్నారనే విషయాన్ని మా నాన్న అక్కడి వారిని అడిగి తెలుసుకుని, ఇంటికి వచ్చి మాకు కథలు కథలుగా చెప్పేవారు. ఇన్నాళ్ల తర్వాత వంశీ.. టైగర్‌ నాగేశ్వరరావపై సినిమా చేయడం, నా తమ్ముడు రవితేజ అందులో నటించడం ఎంతో ఆనందంగా ఉంది` అని తెలిపారు చిరంజీవి. 

ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల `ఖిలాడీ`తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన ప్రస్తుతం `రామరావుః ఆన్ డ్యూటీ`, `ధమాకా`, `రావణాసుర` సినిమాలు చేస్తున్నారు. వీటి తర్వాతే 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. `రామారావు ఆన్ డ్యూటీ` రిలీజ్‌కి సిద్ధమవుతోంది. జూన్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.