రవితేజ తో సినిమా అంటే ఒకప్పుడు కాసులు పంట. ఆయనతో చేసిన సినిమా ఏదీ ఫ్లాఫ్ అయ్యేది కాదు. జనం కూడా డైరక్టర్ ఎవరు,ప్రొడ్యూసర్ ఎవరు అనేది చూడకుండా రవితేజ సినిమా వస్తోందంటే ఎగబడి చూసేవారు. కానీ గత కొంతకాలంగా ఆ పరిస్దితి రివర్స్ అయ్యింది. వరసగా ప్లాఫ్ లు ఆయన్ని పలకరిస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన అమర్ అక్బర్ ఆంటోని అయితే పెద్ద డిజాస్టర్ అయ్యింది. దాంతో రవితేజ తో సినిమా అనగానే నిర్మాతలకు వణుకు పుడుతోందనే చెప్పాలి. ఈ నేపధ్యంలో ఆయన తో అనుకున్న ప్రాజెక్టుని అర్దాంతరంగా ఆపేసారు నిర్మాతలు. 

వివరాల్లోకి వెళితే...మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు రవితేజ హీరోగా ఇంకో సినిమా ప్లాన్ చేసారు. అమర్ అక్బర్ ఆంటోని తర్వాత ఈ సినిమా పట్టాలు ఎక్కాల్సి ఉంది. అయితే  ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్లు...ఆ ఆలోచనను విరమించుకున్నారు. తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన తేరీ ని రవితేజతో రీమేక్ చేద్దామని రైట్స్ తెచ్చుకున్నారు. మొదట వాళ్లు పవన్ హీరోగా ఆ సినిమా అనుకున్నారు. అయితే ఆయన జనసేన పనుల్లో బిజీగా ఉండటం,ఇప్పుడిప్పుడే సినిమా చేసే ఉద్దేశ్యం లేదని ప్రకటన చేయటం జరిగింది. 

దాంతో ఈ రీమేక్ ని రవితేజతో చేద్దామని మైత్రీ వాళ్లు ఫిక్స్ అవటం...ఆయన ఓకే చెప్పటం జరిగింది. సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రానికి డైరక్టర్ గా అనుకున్నారు. ఆయన స్క్రిప్టు మొత్తం రవితేజ ఇమేజ్ కు అనుకూలంగా మార్చుకుంటూ వెళ్లారు. అయితే అమర్ అక్బర్ ఆంటోని డిజాస్టర్ తో ప్రొడక్షన్ హౌస్ వాళ్లు...రిస్క్ చేయటం ఇష్టం లేక ఆ ప్రాజెక్టు ఆపేయాలని నిర్ణయం తీసుకుని దర్శకుడుకు చెప్పేసినట్లు సమాచారం.