మాస్ మహారాజా రవితేజ వరుస పరాజయాలకు బ్రేక్ వేసేందుకు చాలానే కష్టపడుతున్నాడు. రాజా ది గ్రేట్ తర్వాత రవితేజ నటించిన సినిమాలేవీ రాణించలేదు. ప్రస్తుతం రవితేజ విఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా చిత్రంలో నటిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటికే క్రిస్టమస్ వీకెండ్ ని క్యాష్ చేసుకునేందుకు క్రేజీ చిత్రాలన్నీ క్యూ కడుతున్నాయి. నితిన్ నటించిన భీష్మ, శర్వానంద్ నటిస్తున్న 96 రీమేక్, సాయిధరమ్ తేజ్ నటిస్తున్న ప్రతి రోజు పండగే చిత్రాలు క్రిస్టమస్ వీక్ లో ఒకరోజు అటూ ఇటూగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయిపోయాయి. 

అన్ని చిత్రాలపై మంచి అంచనాలు ఉండడంతో ఈ పోటీ అవసరమా అనే చర్చ కూడా జరుగుతోంది. ఇది చాలదన్నట్లు మాస్ మహారాజ రవితేజ కూడా రంగంలోకి దిగిపోయాడు. నితిన్, శర్వా, సాయిధరమ్ తేజ్, రవితేజ ఇలా అందరు హీరోలకు వారి వారి స్థాయిలో మంచి క్రేజ్ ఉంది. అలాంటప్పుడు థియేటర్స్ కొరత సృష్టించుకుని మరీ ఇలా పోటీ పడడం అవసరమా అనే చర్చ కూడా జరుగుతోంది. 

బహుశా సంక్రాంతికి పెద్ద సినిమాలు వస్తున్నాయి కాబట్టి క్రిస్టమస్ పండుగే ఈ చిత్రాల విడుదలకు సరైనది అని నిర్మాతలు భావిస్తున్నారేమో.