మాస్‌ మహారాజా రవితేజ  వరుస ఫ్లాఫుల్లో ఉన్నారు. ఆయన హ్యాట్రిక్‌ పరాజయాలను చవిచూశారు. ఇప్పుడు `ఈగల్‌` చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నాడు. 

మాస్‌ మహారాజా రవితేజ కి ఇటీవల వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. `రామారావు`, `రావణాసుర`, `టైగర్‌ నాగేశ్వరరావు` చిత్రాలు బ్యాక్‌ టూ బ్యాక్‌ బోల్తా కొట్టాయి. దీంతో హ్యాట్రిక్‌ ఫ్లాప్స్ రవితేజ ఖాతాలో చేరిపోయాయి. అయితే ఈ సారి మాత్రం కచ్చితంగా హిట్‌ కొట్టాలని భావిస్తున్నారు. తాజాగా ఆయన `ఈగల్‌` చిత్రంలో నటించింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కార్తిక్‌ ఘట్టమనేని దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో, యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ఆకట్టుకుంది. సినిమాకి కావాల్సిన బజ్‌ తీసుకొచ్చింది. 

పాటలు కూడా ఇటీవల విడుదలయ్యాయి. కానీ అంతంత మాత్రంగానే ఆదరణ పొందాయి. ఇక ఇప్పుడు సినిమా డోస్‌ పెంచేందుకు వస్తున్నారు. `ఈగల్‌` ట్రైలర్‌ విడుదల చేయబోతున్నారు. అందుకు డేట్‌, టైమ్‌ ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 20న(బుధవారం) ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు. సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు `ఈగల్‌` ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో రవితేజ గన్‌ ఎక్కు పెట్టి కాలుస్తున్న లుక్‌ అదిరిపోయింది. 

ఇక రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్‌ కీలక పాత్రలో కనిపిస్తుంది. రవితేజకి జోడీగా కావ్య థాపర్‌ కనిపించనున్నట్టు తెలుస్తుంది. శ్రీనివాస్‌ అవసరాల మరో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ మూవీ విడుదల కాబోతుంది. రవితేజ గత చిత్రాలు ఫ్లాప్‌ కావడంతో ఆయన ఆశలన్నీ ఈ మూవీపైనే పెట్టుకున్నాడు. తన పాత్రలోని కొత్త యాంగిల్‌ని చూడబోతున్నట్టు తెలిపారు. ఆడియెన్స్ కి కూడా ఇదొక కొత్త ఎక్స్ పీరియెన్స్ అని చెప్పారు.