కథ :
కార్తీకేయ(రవితేజ) ఆవేశపరుడైన పోలీస్‌ ఆఫీసర్‌. అసిస్టెంట్‌ కమిషనర్‌గా డ్యూటీ చేస్తున్న సమయంలో ఓ కేసులో ఆవేశంగా ఓ నిందితుడి మరణానికి కారణమై సస్పెండ్‌ అవుతాడు. తరువాత  పాండిచ్చేరిలో కార్తీకేయ ఇండస్ట్రీస్‌ అనే కంపెనీ నిర్వహిస్తూ హ్యాపిగా ఉంటాడు. తల్లి, తండ్రి, బామ్మ, ఇద్దరు చెల్లెల్లు ఇదే కార్తీకేయ ప్రపంచం. తన వ్యాపారానికి అక్కడి లోకల్‌ లీడర్‌ సెల్వం అడ్డు వస్తున్నా.. గొడవలెందుకులే అని తానే సర్దుకుపోతుంటాడు. ఒక రోజు పార్టీలో కార్తీకేయ చెల్లెలు విద్యార్థి నాయకుడు సత్యను కొంత మంది వ్యక్తులు హత్య చేయటం చూస్తుంది. అమ్మానాన్నలు వద్దంటున్నా చెల్లెలితో సాక్ష్యం చెప్పించేందుకు సిద్ధమవుతాడు. పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌లో కార్తీకేయ చెల్లెలు చెప్పిన ఇర్ఫాన్‌ లాలా(ఫ్రెడ్డీ దారువాలా) నాలుగేళ్ల క్రితం కార్తికేయ చంపిన వ్యక్తే అని తెలుస్తుంది. బతికున్న వ్యక్తిని చనిపోయినట్టుగా కార్తికేయను ఎందుకు నమ్మించారు..? కార్తికేయకు ఇర్ఫాన్‌కు గొడవేంటి..? ఇర్ఫాన్ ఖేల్ ను కార్తికేయ ఎలా ఖతం చేశాడన్నదే మిగతా కథ. 

 

విశ్లేషణ :
రవితేజ లాంటి మాస్ హీరోతో రొటీన్‌ సినిమా అయితేనే కరెక్ట్‌ అన్న నమ్మకంతో విక్రమ్ సిరికొండ రొటీన్ కథను ఎంచుకున్నట్టుగా అనిపిస్తుంది. వక్కంతం వంశీ లాంటి స్టార్ రైటర్ అందించిన కథే అయినా... ఎక్కడా కొత్త దనం కనిపించలేదు. ఎమోషనల్‌ యాక్షన్స్‌ సీన్స్ ను మరింత బలంగా రాసుకునే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఎక్కువగా రొమాంటిక్‌ కామెడీ సీన్స్ మీద దృష్టి పెట్టాడు. తొలి భాగం అంతా అసలు కథలోకి వెళ్లకుండా కేవలం రవితేజ, రాశీఖన్నా మధ్య సన్నివేశాలతో సాగదీశాడు. అవి కూడా ఆకట్టుకునే స్థాయిలో లేకపోవటం నిరాశపరుస్తుంది. ద్వితియార్థం కాస్త ఇంట్రస్టింగ్‌గా మొదలు పెట్టినా.. అదే ఊపు కొనసాగించలేకపోయాడు. ప్రతినాయకుడి పాత్రను బలంగా రూపుదిద్దటంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. జామ్‌ 8 గ్రూప్‌ అందించిన సంగీతం కూడా ఆకట్టుకునే స్థాయిలో లేదు. మణిశర్మ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి,నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

 

రవితేజ ఎప్పటిలానే తన ఎనర్జిటిక్‌ పర్ఫామెన్స్‌ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే గతంలో రవితేజ చేసిన తరహా రొటిన్‌ సీన్స్ లో కనిపించటంతో కొత్తదనమేమీ కనిపించదు. హీరోయిన్స్‌  కేవలం కథను సాగదీసేందుకే తప్ప  ఏ మాత్రం ఇంపార్టెన్స్‌ లేని క్యారెక్టర్స్ లో కనిపించారు. ఉన్నంతలో రాశీఖన్నా కాస్త పరవాలేదనిపించింది. సీరత్‌కపూర్‌ గ్లామర్‌ షోతో మెప్పించినా.. నటిగా ఆకట్టుకోలేకపోయింది. తండ్రి పాత్రలో జయప్రకాష్, పోలీస్‌ ఆఫీసర్‌గా మురళీ శర్మ, వెన్నెల కిశోర్‌, సత్యం రాజేష్‌లు ఇప్పటికే చాలా సినిమాల్లో కనిపించిన అదే తరహా పాత్రల్లో కనిపించారు. విలన్‌గా నటించిన ఫ్రెడ్డీ దారువాలా లుక్స్‌పరంగా ఆకట్టుకున్నా.. పెద్దగా తెరపైన కనిపించలేదు. బలమైన సన్నివేశాలు కూడా లేకపోవటంతో విలనిజం వీకైపోయింది.

చివరగా :

రొటీన్ స్టోరీతో ఎనర్జిటిక్ గా వచ్చిన మమాస్ మహారాజ్ “టచ్ చేసి చూడు”