సిట్ విచారణకు ఒక్కొక్కరుగా హాజరవుతున్న టాలీవుడ్ సెలెబ్స్ నిన్న ముగిసిన ముమైత్ ఖాన్ విచారణ ఇవాళ సిట్ విచారణకు హాజరు కానున్న హీరో రవితేజ

తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ డ్రగ్స్ కేసులో 12 మంది టాలీవుడ్ సెలెబ్రిటీలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ కు సంబంధించి దర్శకుడు పూరీ జగన్, చార్మి, ముమైత్ ఖాన్, సుబ్బరాజు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, తరుణ్, నవదీప్ లను విచారించిన సిట్ శుక్రవారం హీరో రవితేజ అలియాస్ రవి శంకర్ రాజు భూపతిరాజును విచారించనుంది.

ఇప్పటికే రవితేజకు కెల్విన్ తో, జీషాన్ తో సంబంధాలున్నట్లు సిట్ అధికారుల వద్ద పక్కా సాక్షాధారాలు వున్నట్లు తెలుస్తోంది. పూరీ వర్గానికి సంబంధించిన వారిలో రవితేజ కీలకంగా వున్న హీరో అని తెలిసిందే. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి హిట్ చిత్రాలు అందించిన రవితేజకు పూరీతో అత్యంత సాన్నిహిత్యం ఉంది. డ్రగ్స్ కేసులో ఇప్పటికే విచారణ ఎదుర్కొన్న పూరీ ఇచ్చిన సమాచారం ఆధారంగా.. ఇప్పటికే పట్టుబడ్డ నిందితులు కెల్విన్, జీషాన్ లు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. రవితేజను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించనున్నట్లు తెలిసింది.

అయితే ఛార్మి హైకోర్టుకు వెళ్లి సాయంత్రం 5 గంటల వరకే విచారణ జరపాలని కోరటంతో హైకోర్టు ఆమె విజ్ఞప్తి మేరకు నిబంధనల ప్రకారం మహిళా అధికారులే చార్మిని విచారించాలని, సమయానికి మించి విచారించాల్సిన అవసరం వుంటే మరుసటి రోజు విచారించాల్సి వుంటుందని కోర్టు సిట్ కు ఆదేశాలిచ్చింది. కానీ చార్మి తన లాయర్ ను తీసుకుని విచారణకు వెళ్తానన్న విజ్ఞాపనను కోర్టు తోసిపుచ్చింది. అయితే ఒక పెళ్లికాని మహిళగా తనకున్న హక్కుల గురించి చార్మి కోర్టుకెళ్లిన నేపథ్యంలో.. రవితేజ విచారణ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందా లేక మరింత సేపు కొనసాగుతుందా అనే అంశంపై సస్పెన్స్ నెలకొంది. రవితేజ 1999లో నీ కోసం సినిమాకు ఉత్తమ నచటుడిగా నంది అవార్డు అందుకున్నరు. అంతేకాక 2002లో కూడా ఖడ్గం సినిమాకుగాను నంది అవార్డు అందుకున్నారు.

2012లో 15.5 కోట్ల వార్షికాదాయంతో ఫోర్బ్స్ జాబితాలో అత్యధిక ఆదాయం పొందిన టాప్ సెలెబ్రిటీల్లో 50 వస్థానం దక్కించుకున్నారు. 2013లో 13 కోట్లతో 68వ స్థానం పొందారు. 2015లో 12.5కోట్లతో 74వ స్థానంలో నిలిచారు రవితేజ. తెలుగులో 50-60 చిత్రాల్లో నటించిన రవితేజ దాదాపు 40 సినిమాల్లో హీరోగా నటించి మాస్ మహారాజ్ అనే గుర్తింపు పొందారు.

ఇక నిన్న ముమైత్ ఖాన్ ను ఆరున్నర గంటలపాటు విచారించారు సిట్ అధికారులు. కెల్విన్ తో గల సంబంధాలపై, డ్రగ్స్ వినియోగంపై, పూరీ తో గల అనుబంధంపై సిట్ ముమైత్ ను విచారించింది. ఇవాళ రవితేజ విచారణ ఎదుర్కోబోతున్నారు.

మరోవైపు సిట్ విచారణకు సంబంధించి రవితేజ ఇప్పటికే లాయర్ తో మాట్లాడారని తెలుస్తోంది. కెల్విన్, జీశాన్ లు విచారణలో రవితేజకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు చెప్పడంతో రవితేజ విచారణ చాలా సీరియస్ గా సాగుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే రవితేజ లాయర్ సలహాలు తీసుకున్నారని, సిట్ ముందు తాను నిర్దోషినని నిరూపించుకోవడానికి సర్వసన్నద్ధమై వెళ్తాడని తెలుస్తోంది.