రవితేజ - హరిష్ శంకర్ మాస్ కాంబో... హీరోయిన్ ను పరిచయం చేసిన యూనిట్.. ఆమె ఎవరంటే?
మాస్ మహరాజా - హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రానికి హీరోయిన్ ఫిక్స్ అయ్యింది. తాజాగా యూనిట్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఆమె పేరు, తదితర వివరాలు తెలుసుకుందాం.
డాషింగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ (Harish Shankar) నుంచి ఇప్పటికే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రావాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో సినిమా మరింతగా ఆలస్యం కానుంది. ఈ గ్యాప్ హరీశ్ తన ఫేవరేట్ హీరో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)తో రీయూనియన్ అయ్యారు. గతంలో వీరి కాంబోలో షాక్, మిరపకాయ వంటి సినిమాలు వచ్చాయి. మిరపకాయ బ్లాక్ బాస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.
దీంతో మూడోసారి వీరిద్దరి కాంబినేషన్ సెట్ అయ్యింది. ఇటీవలనే Mass Reunion అంటూ అధికారికంగా ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. దాదాపు 12ఏళ్ల తర్వాత ఈ కాంబో రిపీట్ కాబోతుంది. రవితేజ వంటి మాస్, ఎనర్జీకి, హరీష్ మాస్ యాక్షన్ టేకింగ్ తోడైతే సినిమా నెక్ట్స్ లెవల్ ఉండబోతుందని చెప్పొచ్చు. ఇప్పుడు అలాంటి సినిమాకే రెడీ అవుతున్నారు. కాగా తాజాగా సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ను అందించారు.
రవితేజకు జోడీగా నటించబోయే హీరోయిన్ ను ప్రకటించారు. తెలుగు ఇండస్ట్రీకి మరో కొత్త హీరోయిన్ ను అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడం విశేషం. తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్న ఈ బ్యూటీ పేరు భాగ్యశ్రీ బోర్స్ (Bhagyashri Borse). నార్త్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇక్కడ ఇదే తొలిచిత్రం.. హీరోయిన్ గానూ ఇదే మొదటి సినిమా అని తెలుస్తోంది. బాలీవుడ్ లో ‘యారియన్ 2’లో నటించిందని తెలుస్తోంది.
మొత్తానికి హరీశ్ శంకర్ - రవితేజ సినిమాను స్పీడ్ గా తెరకెక్కించే పనిలో ఉంది యూనిట్. శరవేగంగా చిత్రీకరణకు పూనుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక రవితేజ, హరీష్ కాంబినేషన్‌లో సినిమా ఎంత మాసీగా ఉండబోతుందో తెలియజేయడానికి `ఈసారి మాస్ రీయూనియన్ స్పైసీగా ఉంటుంది` అని మేకర్స్ అనౌన్స్ చేశారు. త్వరలోనే ఈ మూవీ ప్రారంభం కాబోతుందట. రవితేజ ప్రస్తుతం `ఈగల్`, గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు. దీంతోపాటు మరో సినిమాకి కూడా కమిట్ అయ్యారట. తాజాగా హరీష్ శంకర్ మూవీ తోడవడంతో మొత్తం నాలుగు సినిమాలను లైనప్ లో ఉన్నాయి.