తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రంపై అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. నయనతార ఈ చిత్రంలో మెగాస్టార్ కు జోడీగా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

సైరా చిత్రం అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని అక్టోబర్ 2న గ్రాండ్  రిలీజ్ కు సిద్ధం అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలని ముమ్మరం చేశారు. ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. సౌత్ లో రత్నవేలుకు అద్భుతమైన క్రేజ్ ఉంది. రోబో లాంటి చిత్రానికి కూడా రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. 

గత ఏడాది విడుదలైన రంగస్థలం చిత్రానికి కూడా ఆయనే కెమెరామెన్. ఇక సైరా చిత్ర సంగతులు చెబుతూ ఓ ఇంటర్వ్యూలో రత్నవేలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ చిత్రంలో నైట్ ఎఫెక్ట్ లో ఓ భారీ యుద్ధం ఉంది. ఆ సన్నివేశాన్ని కావాలంటే గ్రాఫిక్స్ ద్వారా నైట్ ఎఫెక్ట్ క్రియేట్ చేయవచ్చు. కానీ అలా చేస్తే నేచురల్ గా ఉండదు. 

నరసింహారెడ్డిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వారు నియమాలు అతిక్రమించి రాత్రి సమయంలో అటాక్ చేస్తారు. అప్పుడే యుద్ధం ఉంటుంది. ఆ యుద్దాన్ని కాగడాల వెలుతురులో చిత్రికరించాలని చెప్పా. సాధారణంగా కాగడాల వెలుతురులో షూటింగ్ అనగానే రిస్క్ అనిపిస్తుంది. చిరంజీవి గారు ఎలా ఎప్పుకున్నారని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. 

చిరంజీవి గారు నా రోబో, రంగస్థలం చిత్రాలని చూశారు. అందువల్లనే నాపై నమ్మకం ఉంచారు. మసకలు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. మరో సన్నివేశంలో క్రేన్ కి 200 అడుగుల ఎత్తులో లైట్స్ పెట్టి మూన్ లైట్ క్రియేట్ చేసాం అని రత్నవేలు తెలిపారు. 

మెగాస్టార్ చిరంజీవి గారికి 60 ఏళ్ళు పైబడ్డాయి. యాక్షన్ సన్నివేశాల్లో ఆయన్ని కష్టపెట్టకూడదు అని అనుకున్నాం. చిరంజీవిగారికే స్వతహాగా గుర్రపు స్వారీ బాగా వచ్చు. ఈ వయసులో కూడా చాలా హుషారుగా గుర్రపు స్వారీ చేశారు. ఇక యాక్షన్ సన్నివేశాల్లో రోప్ కట్టండి నేనే చేస్తా అని చెప్పడంతో మేమంతా ఆశ్చర్యపోయాం అని రత్నవేలు తెలిపారు.