`ఛలో`, `గీతగోవిందం` సినిమాతో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. ఈ సంక్రాంతికి వచ్చిన `సరిలేరు నీకెవ్వరు`తో, ఆ తర్వాత `భీష్మ`తో బ్యాక్‌ టూ బ్యాక్‌ బ్లాక్‌ బస్టర్స్ అందుకుని అగ్ర కథానాయికల జాబితాలో చేరిపోయింది. ఇప్పుడు పలు ఇంట్రెస్టింగ్‌ ప్రాజెక్ట్ ల్లో నటిస్తున్న ఈ అమ్మడు అతిలోకి సుందరిగా మారబోతుందట. మరి ఆ కహానీ ఏంటో చూస్తే. 

తాజాగా రష్మిక అభిమానులతో చాట్‌ చేసింది. అందులో భాగంగా తన అభిమానులకే ఓ ప్రశ్న వేసింది. శ్రీదేవి బయోపిక్‌, సౌందర్య బయోపిక్‌.. ఈ రెండింటిలో ఏ బయోపిక్‌లో నటిస్తే బాగుంటుందని అడిగింది. దీంతో ఆమె అభిమానులంతా శ్రీదేవి బయోపిక్‌లో నటిస్తే బాగుంటుందని సమాధానంగా చెప్పారు. తాను కూడా ఇదే భావిస్తున్నానని తెలిపింది. పరోక్షంగా తనకు శ్రీదేవి బయోపిక్‌లో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని బహిర్గతం చేసింది. 

ఇదిలా ఉంటే ఇటీవల అతిలోకి సుందరి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌.. తన భార్య శ్రీదేవి బయోపిక్‌ తీసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఈ చిత్రంలో అతిలోక సుందరిగా ఎవరు కనిపిస్తారనేది పెద్ద సస్పెన్స్ నెలకొంది. ఈ నేపథ్యంలో రష్మిక తన అభిమానులకు ఇలా పజిల్‌ వేయడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో `పుష్ప` చిత్రంలో, అలాగే తమిళంలో కార్తితో `సుల్తాన్‌` చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది రష్మిక.