'గీత గోవిందం' సినిమాతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది రష్మిక మందన్నా. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బిజీగా గడుపుతోంది. తెలుగులో మహేష్ తో 'సరిలేరు నీకెవ్వరు', నితిన్ తో 'భీష్మ' సినిమాలు చేస్తోన్న ఈ బ్యూటీ తమిళంలో కార్తీతో ఓ సినిమా చేస్తోంది.

దర్శకుడు భాగ్యరాజ కన్నన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 'ఖాకీ' సినిమా తరువాత మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న కార్తి ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. కొద్దిరోజులుగా సైలెంట్ గా సినిమా షూటింగ్ ని నిర్వహిస్తున్నారు.

ఇంకా టైటిల్ ని ప్రకటించలేదు. అయితే యూనిట్ కి తెలియకుండా రష్మిక సోషల్ మీడియా ద్వారా టైటిల్ ని బయటపెట్టేసింది. తాజాగా చిత్రీకరణ పాల్గొన్న రష్మిక 'సుల్తాన్' షూటింగ్ లో నాల్గవ రోజు అంటూ టైటిల్ చెప్పేసింది. తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో తనకు తెలియకుండానే టైటిల్ రివీల్ చేసేసింది.

టైటిల్ విన్న కార్తి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రష్మిక స్టేటస్ షేర్ చేస్తుండడంతో విషయం యూనిట్ కి తెలిసిపోయింది. అధికారికంగా టైటిల్ ప్రకటించడానికి ప్లాన్ చేసుకున్న చిత్రయూనిట్ కి రష్మిక షాక్ ఇచ్చింది. మరి ఈ విషయానికి సంబంధించి చిత్రయూనిట్ రష్మికపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి!