నటీనటులు: తనీష్, ప్రియా సింగ్, పరుచూరి రవి, పోసాని కృష్ణమురళి తదితరులు 
సంగీతం: యోగేశ్వర్ శర్మ 
నిర్మాతలు: పద్బనాభ రెడ్డి, నల్ల అయ్యన్నాయుడు 
దర్శకత్వం: కార్తికేయ 

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ఆరంభించిన నటుడు తనీష్ ఆ తరువాత హీరోగా కొన్ని సినిమాలలో నటించారు. ఒకటి అరా తప్పించి హీరోగా సరైన సక్సెస్ ని అందుకోలేకపోయాడు. ఇటీవల బిగ్ బాస్ 2 లో కంటెస్టెంట్ గా వెళ్లి, ఫైనల్స్ కి చేరుకొని కాస్త పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని తను నటించిన 'రంగు' సినిమాను శుక్రవారం 
ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మరి ఈ సినిమాతోనైనా తనీష్ ని విజయం వరించిందో లేదో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: 
పవన్ కుమార్ అలియాస్ లారా(తనీష్) ఇంటర్ లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించి విజయవాడలో ఓ డిగ్రీ కాలేజ్ లో జాయిన్ అవుతాడు. స్వతహాగా కోప స్వభావం గల లారా కాలేజ్ లో సీనియర్లు ర్యాగింగ్ చేస్తుంటే ఎదురు తిరుగుతాడు. జూనియర్స్ అందరి ముందుండి నాయకుడిగా వ్యవహరిస్తుంటాడు. రెండు గ్రూపుల మధ్య గొడవలతో కాలేజ్ మొత్తం యుద్ధవాతావరణం నెలకొంటుంది.

ఇంతలో పరీక్షలు దగ్గర పడడంతో రెండు గ్రూపులు రాజీ పడి గొడవలను పక్కన పెట్టేస్తారు. అయితే ఓ గొడవలో లారా అనుకోకుండా ఒక వ్యక్తిని చంపేస్తాడు. ఈ కేసులో జైలుకి వెళ్లిన అతడికి అక్కడ పరిచయమైన ఎం ఎల్ పి(పోసాని కృష్ణమురళి) అండతో బెయిల్ పై బయటకి వచ్చి చిన్న చిన్న సెటిల్మెంట్లు చేస్తూ రౌడీగా మారతాడు. లారాని ఇష్టపడిన పూర్ణ(ప్రియా సింగ్) అతడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా లారా స్నేహితుడు సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమించడంతో లారా వారిద్దరికీ పెళ్లి చేస్తాడు.

దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ లంచం తీసుకొని లారా పై రౌడీ షీట్ ఓపెన్ చేస్తాడు. ఈ క్రమంలో పోలీసులకు లారాకి మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. లారాని ఎన్కౌంటర్ చేసి చంపేయాలని పోలీసులు ప్లాన్ చేస్తారు. అక్కడ నుండి తప్పించుకున్న లారా.. పూర్ణ చూపిస్తున్న ప్రేమతో పూర్తిగా మారిపోయి ఆమెని పెళ్లి చేసుకొని ఓ బ్యాంక్ లో జాబ్ జాయిన్ అవుతాడు. సాఫీగా సాగిపోతున్న తన జీవితంలోకి మళ్లీ పాత గొడవలు వస్తాయి.

శత్రువులు లారా ఉద్యోగం పోయేలా చేస్తారు. దీంతో లారా మళ్లీ రౌడీగా మారిపోతాడు. ఈ క్రమంలో అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు..? పోలీసులు, లారా శత్రువులు అతడిని మట్టుబెడతారా..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ: 
కమర్షియల్ హిట్ అందుకోవాలనే తపనతో హీరో తనీష్ అన్ని కమర్షియల్ హంగులు ఉన్న కథను ఎన్నుకున్నాడు. మధ్యతరగతి కుర్రాడు.. గొడవల్లోకి దిగడం, రౌడీగా మారడం.. తన చేజేతులారా భవిష్యత్తుని పాడుచేసుకోవడం.. మరిపోదామని అనుకున్నా పరిస్థితులు అతడికి సహకరించకపోవడం వంటి అంశాలు ఈ సినిమాపై ఆసక్తిని పెంచేవే.. కానీ దర్శకుడు మేకింగ్ లో దొర్లిన తప్పులు కారణంగా ఈ అంశాలను తెరపై సరిగ్గా చూపించలేకపోయాడు. వాస్తవంగా జరిగిన కథ అని ఆసక్తిగా థియేటర్ కి వెళ్లే ప్రేక్షకుడిని ఈ 
సినిమా బాధ పెట్టడం ఖాయం.

కథను కాంప్రమైజింగ్ తీయాలనే ఆలోచనతో చేసిన మార్పులు, చేర్పులు కథను నాశనం చేశాయి. సినిమా మొదలైనప్పటి నుండి ఎండ్ వరకు ఒకే ఫ్లోలో సాగుతూ విసిగిస్తుంది.
ఏ సన్నివేశం కూడా ఆసక్తికరంగా అనిపించదు. బలమైన సన్నివేశాలను కూడా సరైన రీతిలో ఆవిష్కరించలేకపోయారు. ఇక హీరోగా తనీష్ ఎంతగా తన పాత్రలో పరకాయ ప్రవేశం చేసినా.. మెప్పించలేకపోయాడు.

చాలా సన్నివేశాల్లో ఇతర హీరోలను ఇమిటేట్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ లో భావోద్వేగాన్ని పండిచలేకపోయాడు. సినిమాలో సైడ్ క్యారెక్టర్ పోషించిన నటుడు షఫీ కొన్ని సీన్లలో తనీష్ ని డామినేట్ చేశాడు. హీరోయిన్ గా నటించిన ప్రియా సింగ్ తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది. వీరిద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చూడడానికి 
కాస్త కష్టంగా అనిపిస్తాయి. సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించిన పరుచూరి రవికి మంచి పాత్ర దక్కిందనే చెప్పాలి. సినిమాలో హీరో కంటే ఇతడి పాత్ర హైలైట్ అయింది.

పోసాని, పరుచూరి, షఫి లాంటి సీనియర్‌ నటులు ఉన్నా వాళ్లని పూర్తిగా ఉపయోగించుకోలేపోయారు. సంగీతం ఏమంత ఆకట్టుకోదు. సినిమా మొత్తం బెజవాడలో సాగే కథ కావడంతో కొత్త  ఫ్రేమింగుల కోసం వెతుక్కునే పని లేకుండా ఉన్నంతలో సినిమాను చుట్టేశారు. పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగ్స్ బాగున్నా కథ, కథనాలలో ఉన్న లోపాల కారణంగా వాటికి విలువ లేకుండా పోయింది. నిర్మాణ విలువలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. మొత్తానికి తనీష్ 'రంగు' ఆడియన్స్ పై ప్రభావం చూపలేకపోయింది. 

రేటింగ్: 2/5