రామ్ చరణ్ సుకుమార్ ల కాంబినేషన్ లో ఈ నెలాఖరుకు విడుదల కాబోతున్న ‘రంగస్థలం’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగా ఈమూవీ బిజినెస్ అత్యంత భారీ స్థాయిలో జరిగింది. రామ్ చరణ్ కెరియర్ లో తొలి 100 కోట్ల సినిమాగా మారుతుంది అని అంచనాలు ఉన్న ఈమూవీ పాటల పై ఇప్పుడు జరుగుతున్న నెగిటివ్ ప్రచారం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. 

 

‘రంగస్థలం’ పాటలను ఒకొక్కటిగా విడుదల చేస్తూ ఈమూవీ పై అంచనాలు పెంచడానికి దర్శకుడు సుకుమార్ అనేక వ్యూహాలు రచిస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఈమూవీకి సంబంధించిన మొట్టమొదటి పాట ‘ఎంత సక్కగున్నావే’ ఇన్ స్టెంట్ హిట్ కావడంతో ‘రంగస్థలం’ మూవీ పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఆ తరువాత విడుదలైన రెండవ పాట ‘రంగా రంగా రంగస్థలాన’ మళ్ళీ అదే జానపద బాణీలో ఉంటూ వేదాంత ధోరణిలో ఉండటం చరణ్ అభిమానులకు పూర్తి సంతృప్తిని ఇవ్వలేక పోయింది అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి.

 

ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీకి సంబంధించి లేటెస్ట్ గా విడుదలైన ‘రంగమ్మా మంగమ్మా ఏమి పిల్లాడు’ పాటను విని చరణ్ అభిమానులు షాక్ అవ్వడమే కాకుండా తల పట్టుకుంటున్నట్లు టాక్. ఈపాటకు సంబంధించిన ట్యూన్ ఏమాత్రం క్యాచీగా లేకపోవడమే కాకుండా ఒక ప్రవేట్ ఆల్బమ్ లో పాటలను వింటున్నట్లు ఉంది అని ఏకంగా చరణ్ అభిమానులే అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది. దీనితో ఈపాటను కంపోజ్ చేసిన దేవిశ్రీప్రసాద్ పై తీవ్ర అసహనాన్ని వ్యక్త పరుస్తున్నారు చరణ్ అభిమానులు. 

 

 

1980 కాలానికి చెందిన కథగా తీసున్న ఈ లవ్ స్టోరీ నేటి యూత్ కు కనెక్ట్ అవుతుందా ? అన్న ప్రశ్నలు కూడ వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా విడుదలైన పాటలు అన్నీ జానపద రీతిలో ఉండటంతో కేవలం సుకుమార్ టేకింగ్ మ్యాజిక్ పైన మాత్రమే ‘రంగస్థలం’ సక్సస్ ఆధారపడి ఉంది అని అంటున్నారు. దీనికితోడు ఈమూవీలో సమంత డీ గ్లామర్ గా కనిపించడం మొత్తం సినిమా అంతా పల్లెటూరి నేపధ్యంలో తీయడంతో కేవలం ఈమూవీ ఏ క్లాస్ సెంటర్ ప్రేక్షకులకు మల్టీ ప్లెక్స్ ప్రేక్షకులకు పరిమితమయిపోయే సినిమాగా మారే ప్రమాదం ఉంది అంటూ జరుగుతున్న నెగిటివ్ ప్రచారం ఈసినిమాను భారీ రేట్లకు కొనుక్కున్న బయ్యర్లను కలవర పెడుతోంది అని టాక్.